ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కౌకుంట్ల రవి
విశాలాంధ్ర, ఉరవకొండ : అనంతపురం జిల్లాలో వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గుంతకల్లు డివిజన్ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కౌకుంట్ల రవి అధికారులను కోరారు. శెట్టూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఆగస్టు 22న చోటుచేసుకున్న ఘటనను దృష్టిలో ఉంచుకుని ఆయన విలేకరులకు ఒక ప్రకటన విడుదల చేశారు.
హాస్టల్ విద్యార్థులు బహిర్భూమి కోసం హాస్టల్ పక్కనే ఉన్న పాడుబడిన భవనం వద్దకు వెళ్లగా శిథిలావస్థలో ఉన్న గోడ కూలి విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు హాస్టల్ పరిసరాల్లో ఉండటం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తోందని తెలిపారు. జిల్లాలోని, బ్రహ్మసముద్రం పాటు అన్ని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ వసతి గృహాలతో పాటు గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఉన్నతాధికారులు తరచూ ఆకస్మికంగా తనిఖీ చేయాలని కౌకుంట్ల రవి కోరారు. భవనాల పటిష్టత, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించాలన్నారు.
ప్రత్యేకంగా బాలికల వసతి గృహాల్లో భద్రతా సిబ్బంది, రక్షణ చర్యలు తగినంతగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. పాడుబడిన భవనాలు, శిథిలావస్థలో ఉన్న గోడలు, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి వెంటనే తొలగించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం, సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారుల బాధ్యత అని కౌకుంట్ల రవి పేర్కొన్నారు. శెట్టూరు ఘటన పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీల్లో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించి లోపాలను తక్షణమే సరిచేయాలని ఆయన కోరారు.


