Homeసంపాదకీయంచిచ్చర పిడుగు

చిచ్చర పిడుగు

- Advertisement -

ఒకటో తరగతి చదువుతున్న ఆ ఆరేళ్ల కుర్రాడు ఆదిత్య కుమార్‌ను చూస్తే ముచ్చటేస్తోంది. అతడిది పత్రికలు చదివి అర్థం చేసుకునే వయసు కాదు. కానీ టీవీ చానళ్లు చూసి దేశకాల పరిస్థితులను గమనిస్తున్న తీరు, సంధిస్తున్న విమర్శనాస్త్రాలు బిత్తరపోయేలా చేస్తున్నాయి. ఏడవ తరగతి పరీక్ష తప్పిన బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. మంగళవారం పట్నాలోని గరÝనీ బాగ్ దగ్గర జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు ఆ బుడతడు కూడా హాజరయ్యాడు. అతడి తల్లిదండ్రులు చదువుకున్న వారు కాదు. తండ్రి రోజు కూలీ. తల్లి ఇళ్లల్లో అంట్లు తోమి, కసవు ఊడ్చి బతుకు వెళ్లదీస్తోంది. కానీ ఆ కుర్రాడికి ఉన్న జ్ఞానం, అతని దగ్గర ఉన్న సమాచారం, సామ్రాట్ చౌదరి నుంచి ప్రధానమంత్రి మోదీ దాకా అందరినీ నిలదీస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. ఆ కుర్రాడి బలవంతం మీదే తల్లిదండ్రులు కూడా ఆందోళన జరుగుతున్న చోటికి చేరుకున్నారు. ఘనత వహించిన పోలీసులు ఈ కుర్రాడిని నిర్బంధించి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అయిదు గంటల పాటు ప్రశ్నలతో వేధించారు. అతని తల్లిదండ్రులను కొట్టారు. మళ్లీ ఇలాంటి ఉద్యమాలలో పాల్గొనకూడదని ఆదిత్య కుమార్‌ను బెదిరించారు. మళ్లీ ఇలాంటి పనే చేస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. కానీ ఆ కుర్రోడు ఇసుమంత కూడా బెదరలేదు. అవసరం వస్తే లాఠీ దెబ్బలు తింటాను. జైలుకైనా వెళ్తాను అంటున్నాడు. పెరుగుతున్న నిరుద్యోగంపై ధ్వజమెత్తాడు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల రద్దు కోసం ఆందోళన చేస్తున్న బిహార్ విద్యార్థులతో గొంతు కలిపాడు. ఆ కుర్రాడు తెల్సుకున్న అంశాల విస్తృతి చూస్తే ఎవరైనా ఆశ్చర్యంతో నోరు తెరిచి నివ్వెరపోవాల్సిందే. విద్యార్థులు, యువత పోరాటం బీజేపీకి వ్యతిరేకమైంది కాదనీ, వారు తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు అని తేల్చి చెప్పాడు. పరిస్థితి మారకపోతే తాను పెరిగి పెద్దైన తరవాత తన పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. ఆందోళనకు దిగిన యువత బారికేడ్లను విరగ్గొట్టడం తప్పనిగానీ ఒప్పనిగానీ తాను చెప్పనంటున్నాడు. ఇది ఆ బుడతడి మానసిక పరిపక్వతకు నిదర్శనం. అతని పుస్తకాల సంచీలో రాజ్యాంగం ప్రతి ఉంటుంది. ఇప్పటిదాకా 80 పేజీలు చదివాడట. 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోదీకి గుడి కట్టిస్తామంటున్నారని, దాని బదులు ఆ డబ్బు పేదలకు పంచితే ఎంత బాగుండేది అంటున్నాడు. బీజేపీ రాముడి మాటెత్తి రామమందిరానికి భక్తులు సమర్పించిన కానుకలను, విరాళాలను కాజేయడం ఘోరం అని చెప్తున్నాడు. తాను భయపడనని తప్పు జరిగితే గొంతెత్తుతానని తెగేసి చెప్తున్నాడు. తన తల్లిని, తండ్రిని పోలీసు సూపరింటెండెంట్ స్వయంగా కొట్టాడని కూడా అంటున్నాడు. తనను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లిన తరవాత మళ్లీ ఇలాంటి ఉద్యమాల జోలికి వస్తే మీ అమ్మ మీద, నాన్న మీద ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేస్తామని పోలీసులు బెదిరించారంటున్నాడు. ఆందోళన సమయంలో ఓ బస్సు మీదకు ఎక్కి త్రివర’ పతాకాన్ని ప్రదర్శించాడు. నేను ఏదో చేస్తే మా తల్లిదండ్రులను ఎందుకు కొట్టాలి అని నిలదీస్తున్నాడు. ముఖ్యమంత్రి ఈ విషయం గ్రహిస్తే ఆ పోలీసు వారి మీద చర్య తీసుకోవాలని నిర్భయంగా అడుగుతున్నాడు. ఆదిత్య కుమార్ది పేద కుటుంబం. అందువల్ల ఇంట్లో టీవీ కూడా ఉన్నట్టు లేదు. తన స్నేహితుడి ఇంట్లో టీవీ చూసి ఈ విషయాలన్ని గ్రహించానంటున్నాడు. జార్ఖండ్‌లో ఆందోళన జరిగినా అక్కడి ప్రభుత్వం యువత కోర్కెలు అంగీకరించింది కదా బిహార్ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నాడు. యువత ఆందోళన గత 18వ తేదీన మొదలైంది. విద్యార్థులు, నిరుద్యోగులు గరÝనీ బాగ్‌లో నిరంతరం ధర్నా చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను, అవకతవకలను యువత ప్రశ్నిస్తోంది. ఆదిత్య కుమార్ వీరితో గొంతు కలుపుతున్నాడు. ఈ ఉద్యమం 25వ తేదీన తీవ్రమైంది. ఆందోళన చేస్తున్న యువత, విద్యార్థులు గాంధీ మైదాన్ నుంచి ముఖ్యమంత్రి ఇంటి దాకా వెళ్లారు. మంగళవారం ఆందోళనకారులు బారికేడ్లు విరిచేసిన తరవాత పోలీసులు లాఠీచార్జీ చేశారు. జలఫిరంగులు ప్రయోగించారు. అనేక మంది నిరసనకారులను నిర్బంధించారు. ఆదిత్య ఏ మాత్రం బెదురు లేకుండా మాట్లాడడం అందరినీ అబ్బురపరిచింది. అదే సమయంలో ఆరేళ్ల కుర్రాణ్ని నిర్బంధించి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడం ఏమిటి అన్న ప్రశ్నలూ గట్టిగానే వినిపించాయి. అయితే ఆదిత్య తల్లిదండ్రులను తాము కొట్టలేదని, హింసించలేదని పోలీసులు నమ్మబలుకుతున్నారు. ఆ కుర్రాడి క్షేమం కోసం తాము అతడిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లామని, ఆ తరవాత తల్లిదండ్రులకు అప్పగించామని అంటున్నారు. అదే నిజమైతే తల్లిదండ్రులను ఎందుకు కొట్టినట్టో! పరిస్థితి బాగాలేనప్పుడు ఆరేళ్ల కుర్రాడిని నిరసన జరుగుతున్న చోటికి రానివ్వకూడదని కూడా పోలీసులు హితోక్తులు పలికారు. కానీ ఆ కుర్రవాడి నిర్భీకత, జ్ఞానం చూస్తే అతడిని తల్లిదండ్రులు తీసుకొచ్చారని నమ్మలేం. మంగళవారం జరిగిన నిరసనోద్యమంలో ఈ బుడతడే ప్రత్యేక ఆకüణగా నిలిచాడు. అనేక చానళ్ల వారు అతడిని ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియోలన్ని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. భవిష్యత్తులో తాను ఏమైనా అవుతాను కానీ పోలీసును మాత్రం కానని ఆదిత్య చెప్పిన తీరు పోలీసుల కరకుతనాన్ని నిర్భయంగా ఎత్తి చూపడమే. తాను పోలీసును అయితే నాయకులు, ఎమ్మెల్యేలు తన మీద ఒత్తిడి చేసి బూటకపు కేసులు నమోదు చేసేట్టు చేస్తారు కనక తనకు పోలీసు కావడం ఇష్టం లేదని ఆ కుర్రవాడు అంటున్నాడు. బీజేపీ అంటే బలాత్కారీ ఝూటా పార్టీ అంటున్నాడు. అంతేకాదు ప్రధాని మోదీని, బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని రాజీనామా చేయమంటున్నాడు. నెహ్రూ స్వాతంత్య్రం కోసం పోరాడి జైలుకెళ్లి ప్రధానమంత్రి అయ్యాడని కూడా గుర్తు చేస్తున్నాడు. సమాజంలో జరుగుతున్న పరిణామాలు, మోదీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాలు అందరికీ అర్థం అవుతున్నాయి. కానీ ఆరేళ్ల కుర్రాడు ఈ విషయాలను కూలంకషంగా గ్రహించడం, ఏ మాత్రం బెరుకు లేకుండా వ్యతిరేకించడం వింతే. ఆదిత్యకుమార్ నోటి వెంట వెలువడిన మాటలు ఎవరో నేర్పితే పలికినవి కావని ఆ వీడియోలు చూస్తే తెలుస్తోంది. దాచేస్తే దాగని సత్యాలన్నీ ఆ కుర్రాడికి కరతలామలకమే. పరిస్థితుల ప్రభావం, నిరాఘాటంగా కొనసాగుతున్న అక్రమాలు, ప్రభుత్వ దాష్టీకం పిల్లలను కూడా నిజం గ్రహించేట్టు చేస్తున్నట్టుంది. ఆ కుర్రాడి మాటలు వింటే అంధ భక్తులకు కనువిప్పు కలుగుతుందని ఆశించడం మాత్రం అత్యాశే అవుతుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు