Homeఅంతర్జాతీయంకొత్త ప్రపంచ పటానికి యూఎన్‌ఓ ఆమోదం..

కొత్త ప్రపంచ పటానికి యూఎన్‌ఓ ఆమోదం..

- Advertisement -

164 దేశాలు తీర్మానానికి అనుకూలం..అమెరికా మాత్రమే వ్యతిరేకంగా ఓటు
కొత్త పటంలో పెద్దగా కనిపించనున్న ఆఫ్రికా
ప్రపంచ పటాన్ని చూడగానే ఆఫ్రికా కంటే యూరప్‌, ఉత్తర అమెరికా పెద్దవిగా కనిపిస్తాయి. కానీ వాస్తవ పరిస్థితి అలా కాదు. భూమి ఆకారాన్ని చదునైన పటంగా మార్చినప్పుడు ఏర్పడిన వక్రీకరణే దీనికి కారణం. ఇప్పుడు ఈ తేడాను సరిచేసేందుకు ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికా అసలు పరిమాణానికి దగ్గరగా కనిపించే కొత్త పటానికి జనరల్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. టోగో నేతృత్వంలో వచ్చిన తీర్మానానికి 164 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఒక్క అమెరికా మాత్రమే వ్యతిరేకించింది. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని ఆఫ్రికన్‌ యూనియన్‌ స్వాగతించింది. ప్రపంచ భౌగోళిక చిత్రణ మరింత కచ్చితంగా, సమానంగా ఉండేందుకు ఇదొక చారిత్రక అడుగు అని పేర్కొంది. కొత్తగా ప్రోత్సహిస్తున్న పటాన్ని ‘ఈక్వల్‌ ఎర్త్‌ ప్రొజెక్షన్‌్ణ అంటారు. ఇది 2018లో రూపొందించారు. ఇందులో దేశాలు, ఖండాలు వాటి వాస్తవ భూవైశాల్యానికి అనుగుణంగా కనిపిస్తాయి. దీంతో ఆఫ్రికా పరిమాణం పెద్దగా కనిపిస్తుంది. యూరప్‌, ఉత్తర అమెరికా పరిమాణం మాత్రం మెర్కేటర్‌ పటంతో పోలిస్తే తగ్గుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న మెర్కేటర్‌ పటాన్ని 1569లో ఫ్లెమిష్‌ కార్టోగ్రాఫర్‌ గెరార్డస్‌ మెర్కేటర్‌ రూపొందించారు. సముద్ర ప్రయాణాల్లో దిశలు, కోణాలను కచ్చితంగా చూపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే భూమి గుండ్రని ఆకారాన్ని చదునైన పటంగా మార్చడం వల్ల ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు వాస్తవం కంటే పెద్దగా కనిపిస్తాయి. అందుకే గ్రీన్‌లాండ్‌ దాదాపు ఆఫ్రికా అంత పెద్దదిగా కనిపిస్తుంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్‌లాండ్‌ కంటే దాదాపు 14 రెట్లు పెద్దది. అయితే యూఎన్‌ఓ నిర్ణయం వల్ల మెర్కేటర్‌ పటం వెంటనే కనుమరుగుకాదు. ఈ తీర్మానం తప్పనిసరి కాదు. దేశాలు, పాఠశాలలు, ప్రచురణ సంస్థలు, టెక్‌ కంపెనీలు కొత్త పటాన్ని స్వచ్ఛందంగా స్వీకరించాల్సి ఉంటుంది. టోగో మాత్రం ఈ ఏడాది చివరికల్లా తమ పాఠశాలల భౌగోళిక పుస్తకాల్లో కొత్త పటాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు