Homeవిశ్లేషణబద్లావ్ జరూరీ హై!

బద్లావ్ జరూరీ హై!

- Advertisement -

చింతపట్ల సుదర్శన్

దొరికినవేవో నమిలి, నమిలినవేవో గుర్తు చేసుకుంటూ అరుగు ఎక్కింది డాంకీ. అప్పటికే పెత్త నాలూ, తిరుగుళ్లూ పూర్తి చేసుకుని వచ్చిన డాగీ గోడకు వీపూ, తోకా ఆనించి నిద్రపోతున్నది. పగలంతా మొద్దునిద్ర, రాత్రంతా అరుపులు అలవాటయినయి దీనికి అనుకుంటూ తన జాగాలో కూచున్న డాంకీకి అల్లంత దూరాన్‌నుంచి వస్తూ కనిపించాడు ఓ బవిరి గడ్డం వాడు, చింపిరి జుట్టునూ చిరుగుల అంగీనీ మోసుకుంటూ వస్తున్నవాడు. ఇంకేముంది వాడు ఈ అరుగు దగ్గరికి రాగానే డాగీ ‘బ్రో’ లేచి వీరంగమాడేస్తాడు. అరుపులతో అదరగొట్టేస్తాడు అనుకుంది. డాంకీ అనుకున్నట్టుగానే అడుగుల చప్పుడు విని చెవులు రిక్కించి చెంగున లేచి కూచుంది డాగీ. ఇక ‘సంగీత విధ్వంస’ కార్యక్రమం మొదలు అనుకుంది డాంకీ. అరుగు పక్కనించి వెళ్తున్న ఆ మనిషిని అరుగు కొసాకు వెళ్లి అలా చూస్తూ నిలబడిపోయింది డాగీ కానీ తోక ఊపనూ లేదు నోరు తెరవనూ లేదు. ‘ఇదేమి చిత్రం మాయా మాయా మైకం కమ్మిందా? అనుకున్న డాంకీ అడగనే అడిగింది. అదేంటి బ్రో ఉలుకూపలుకూ లేకుండా అలా ‘టాయ్ డాగ్’ లా నిలబడిపోయేవు నోరు తెరవలేదేం అని. నోరు తెరిచినా, అరుపు అరిచినా లాభం లేదు భయ్యా ! అయినా దారేపోయే దానయ్యను చూసి అరిచి గీపెట్టి మొత్తుకోవాలనే రూల్ ఉందా? అంది డాగీ. అదేంటోయ్! కొత్తగా వింతగా మాట్లాడుతున్నావు. బిచ్చగాళ్లమా, బిచ్చగాళ్ల వేషంలో వచ్చే దొంగలనూ, బైరాగులనూ చూస్తే నీకు పళ్లు తీపులు కదా, నాలుక జారుడు కదా అరుపులు మామూలే కదా! అదంతా నిన్నటి దాకా కాదు కాదు ఈ క్షణందాక! ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు తల్లో ఉన్నది కొంచెం వాడుదామనుకుంటున్నా. నీకు ఈ సంగతి తెల్సుకదా అరిచే కుక్కలు కరవవని అంటారు కదా ! అంది డాగీ. అవును ఆ మాట నిజమే అయితే దానికీ నీలో మార్పుకీ లింకేమిటసలు అంది డాంకీ. నీకూ నాకూ తెల్సినట్టు ఆ దారేపొయ్యే దానయ్యకీ తెలిసుంటుంది అరిచే కుక్క కరవదని అందువల్ల నిశ్చింతగా నడిచిపోతాడు. ఎలాగూ కరవని కుక్కనైన నేను అరిచి సాధించేదేమీ లేదని తెల్సుకున్నాను కనుక అనవసరంగా అరిచి నోరుపారేసుకుని హైరానా పడదల్చుకోలేదు అని డాగీ అంటుంటే అరే! ఈ ముక్క మన ప్రజా సేవకులకు అర్థం అయితే ఎంత బాగుండేది అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. రా బ్రో రారా ! మన డాగీ ఏదో మార్పు గురించి మాట్లాడుతున్నది అంటూ ఆహ్వానించింది డాంకీ అబ్బాయిని. వచ్చి తన జాగాలో కూర్చుంటూ అన్నాడబ్బాయి మార్పు మంచిదేగా ! మంచి కావాలంటే, మంచి జరగాలంటే పాతనీరు కొట్టుకు పోవాల్సిందే కొత్త ఊపు రావాల్సిందే అన్నాడు అబ్బాయి. అన్నా నువ్వనేదేమిటో బుర్రకి సరిగ్గా ఎక్కడం లేదు. కొంపదీసి ప్రభుత్వాలు మారడం గురించి కాని, పార్టీలు మారడం గురించి కానీ అనడం లేదు కదా అంది డాగీ. ఏంటి మారేది? ఇంకో పదేళ్ల దాకా నేనే ముఖ్యమంత్రిని అంటాడొకాయన. ఇరవై యాభై దాకా కదిలేదే లేదంటాడో లీడరు. ఎవ్వరూ మారడానికి, సీటు వదలడానికి ఇష్టపడరు కదా! అంది డాంకీ. నువ్వన్నదాంట్‌లో ‘మ్యాటర్’ లేకపోలేదు. ప్రభుత్వాలు మారవచ్చు. పదవులు రాని వాళ్లు పార్టీలు మార్చవచ్చు కానీ ఈ మార్పులు మనుషులు తమ స్వంత లాభం కోసం మాత్రమే వాడుకునేవే అన్నాడు అబ్బాయి. ప్రభుత్వాలు మారినా పార్టీలూ, జండాలూ మారినా ఇటు మనుషులటు, అటు మనుషులిటు అవుతారే కాని, నిజమైన మార్పు ఏమిటసలు అంది డాగీ. నిజమైన మార్పు అంటే ఇవేమి కాదు డాంకీ అబద్ధపు హామీలు, అసత్య ప్రచారాలు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే కారుకూతలు, ఉచితాల పేరు మీద సింహాసనాలు ఎక్కి కూర్చోవడాలూ కాదు. జి.డి.పి. పెరిగిందని బాకా వాయించుకోవడం, లేని ఉద్యోగాలు కల్పించామనడం, పేదరికం హుష్ కాకయిందనడం విశ్వానికే గురువులమైనామనడం ‘సొమ్ము భద్రం భవిత బంగారం కోసమే’ కాని మనుషుల్లో నిజమైన మార్పు రావాలి. ఆలోచనల్లో ఆచరణల్లో, లక్ష్యాన్ని చేరుకోవడంలో నిజాయితీతో కూడిన మార్పు రావాలి అసలైన మార్పు రావాలి అన్నాడు అబ్బాయి. దీన్నే కదా ‘బద్లావ్ ‘ అంటారు అంది డాంకీ. ‘బద్లావ్ జరూరీ హై’ కనకే నేనూ మారాను అనవసరంగా అరవకూడదని నిర్ణయించుకున్నాను అంది డాగీ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు