ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలను సమూలంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) విధానంలో రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 106 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 123 మున్సిపాలిటీల్లో ఏకకాలంలో పనులు మొదలు కానున్నాయి. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.7,469 కోట్లు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో ప్రత్యేకంగా రూ.3,890 కోట్ల విలువైన పనులను చేపట్టనున్నారు.ఈ నిధులతో ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రోడ్ల నిర్మాణానికి రూ.4,656 కోట్లు, సెంట్రల్ మీడియన్ల ఏర్పాటుకు రూ.88 కోట్లు, కొత్త స్ట్రీట్ లైటింగ్ కోసం రూ.247 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.509 కోట్లు కేటాయించారు.ఈ కార్యక్రమం పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,165 కిలోమీటర్ల రోడ్లు, 502 పార్కులు, 210 కిలోమీటర్ల సెంట్రల్ మీడియన్లు, 391 కిలోమీటర్ల మేర స్ట్రీట్ లైటింగ్, 300 కిలోమీటర్ల సీవరేజ్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి వస్తాయి.పట్టణ స్థానిక సంస్థలపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పనులను హెచ్ఏఎం పద్ధతిలో అమలు చేస్తోంది. ఈ విధానంలో కాంట్రాక్టర్లు తమ సొంత నిధులతో పనులు పూర్తిచేయగా, ప్రభుత్వం వారికి వార్షిక వాయిదాల రూపంలో చెల్లింపులు చేస్తుంది.కుప్పంలో పనులు ప్రారంభించిన తర్వాత సీఎం చంద్రబాబు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, మునిసిపల్ శాఖ అధికారులతో మాట్లాడి దిశానిర్దేశం చేయనున్నారు.ఈ పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీనీవా కాలువను సందర్శించి కృష్ణా జలాలకు సీఎం జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం ఈసీ పౌల్ట్రీ షెడ్ కార్యక్రమం కింద ఎంపికైన కొందరు లబ్ధిదారులతో ముచ్చటించి, మధ్యాహ్నం పార్టీ కేడర్‌తో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.
ఏపీ పట్టణాలకు కొత్త కళ.. రూ.11,359 కోట్ల భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం
- Advertisement -
RELATED ARTICLES


