రాజ్యసభలో ఖాళీ కానున్న 12 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.ఇందులో ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి.పశ్చిమ బెంగాల్‌లో ఖాళీ అయిన మరో స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలన్నీ అక్టోబర్ 16న జరగనున్నాయి.పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజ్యసభ సభ్యురాలు రుక్మిణి మల్లిక్ రాజీనామా చేయడంతో ఆ స్థానం 2026 జులై 16న ఖాళీ అయింది.
రాజ్యసభ ఛైర్మన్ ఆమె రాజీనామాను అదే తేదీ నుంచి ఆమోదించినట్లు అధికారిక రికార్డుల్లో నమోదైంది. దీంతో ఆ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇదే..
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 29న విడుదల చేయనున్నారు.నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 6 చివరి తేదీ. అక్టోబర్ 7న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు.అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 9 వరకు గడువు ఉంటుంది.అక్టోబర్ 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియను అక్టోబర్ 19లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
బ్యాలెట్‌పై ప్రత్యేక నిబంధన..
రాజ్యసభ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రంపై ప్రాధాన్య క్రమాన్ని సూచించేందుకు ఎన్నికల సంఘం అందించే నిర్దిష్ట వైలెట్ రంగు స్కెచ్ పెన్‌ను మాత్రమే ఉపయోగించాలి.ఇతర పెన్నులతో గుర్తులు వేయడానికి అనుమతి ఉండదు.ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పరిశీలకులను నియమించి, మొత్తం ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు ఈసీ తెలిపింది.
ముగియనున్న పలువురు నేతల పదవీకాలం..
నవంబర్ 25తో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సహా పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది.ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీకి చెందిన అరుణ్ సింగ్,గీతా షాక్య,నీరజ్ శేఖర్, బ్రిజ్‌లాల్,బీఎల్ వర్మ, సీమా ద్వివేది, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీకి చెందిన రామ్జీ గౌతమ్ పదవీకాలం కూడా ముగియనున్న సభ్యుల జాబితాలో ఉన్నారు.


