విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం అపరిశుభ్రతపై ఈనెల 19న విశాలాంధ్రలో ప్రచురితమైన కథనానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. ఉపకేంద్రం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. వైద్య వ్యర్థాలు పేరుకుపోకుండా చర్యలు చేపట్టారు. ఆరోగ్య కేంద్రం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులను గ్రామస్తులు అభినందించారు.ప్రజారోగ్యానికి సంబంధించిన కేంద్రాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించాలని స్థానికులు కోరుతున్నారు. విశాలాంధ్రలో వచ్చిన కథనానికి స్పందించి తక్షణ చర్యలు చేపట్టడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.


