4 నగరపాలక, 19 పురపాలక సంఘాలకు లభించని విముక్తి
ఐదేళ్లుగా పెండింగ్లోనే 23 పట్టణాలు
కోర్టు వివాదాలతో నేటికీ కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలన
వైసీపీ పాలనలో స్తంభించిన ప్రజాస్వామ్యం
కూటమి ప్రభుత్వంలోనూ కదలని ఫైళ్లు
విశాలాంధ్ర- సచివాలయం: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం, మున్సిపల్ పరిపాలనా శాఖ, అధికార యంత్రాంగం సమాయత్త మవుతున్నాయి. ఓటర్ల జాబితాల సవరణ, వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి ప్రక్రియలతో పురపాల కంలో ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే, గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిసర గ్రామాలను విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాలు నేడు మున్సిపల్ ఎన్నికలకు పీఠముడిగా మారాయి. నాటి న్యాయవివాదాల కారణంగా ఎన్నికలు నిలిచిపోయిన 4 నగరపాలక సంస్థలు, 19 పురపాలక సంఘాలకు మాత్రం ఇప్పటికీ విముక్తి లభించ లేదు. దాదాపు 110 పంచాయతీల్లో ఐదేళ్లకు పైగా ప్రజాప్రతినిధులే లేక స్థానిక స్వయంపాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా 23 పట్టణాలకు రావాల్సిన కేంద్ర, రాష్ట్ర నిధులు నిలిచిపోయి అభివృద్ధి పనులు పడకేశాయి. కూటమి ప్రభుత్వంలోనైనా ఈ ‘విలీన గ్రహణం’ వీడి తమ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయని ఆశించిన ప్రజలకు, నేటికీ పాలకుల నుంచి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో తీవ్ర నిరాశే ఎదురవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం 2020లో సమీప గ్రామాలను సమీపంలోని పురపాలక, నగరపాలక సంస్థల్లో విలీనం చేస్తూ జీవోలు జారీ చేసింది. అయితే, తమ గ్రామాల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని, పన్నుల భారం విపరీతంగా పెరుగుతుందని భావించి ఆయా గ్రామాలకు చెందిన పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానిక ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. విలీన ప్రతిపాదనలపై విచారణ జరిపిన హైకోర్టు… గ్రామాల విలీనాన్ని నిలిపివేస్తూ, ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించవద్దని ఆదేశిస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2021, మార్చి 10న రాష్ట్రంలో మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు సజావుగా సాగినా, వివాదాల్లో చిక్కుకున్న శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. రాజాం, ఆముదాలవలస, తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడి, తాడిగడప, గుడివాడ, బాపట్ల, నరసరావుపేట, పొన్నూరు, కందుకూరు, పొదిలి, కావలి, ఆలూరు, గూడూరు, బి.కొత్తకోట, శ్రీకాళహస్తి వంటి 19 మున్సిపాలిటీల్లోనూ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. 2021లో ఎన్నికలు పూర్తయినా స్థానిక సంస్థల ఐదేళ్ల కాలపరిమితి పూర్తవడంతో, ఈ ఏడాది మార్చి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. మళ్లీ నూతనంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నప్పటికీ, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల సమస్యపై ఏమాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన జీవోలకు మున్సిపల్ పరిపాలనా శాఖ తగిన రీతిలో చట్టసవరణ చేయాల్సి ఉంది. ఈ సమస్య తీవ్రతను, చట్టసవరణ అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా గత రెండేళ్లుగా ఎలాంటి పురోగతి లేదు. పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన శాఖల మధ్య సమన్వయం కొరవడటమే దీనికి ప్రధాన కారణమం. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోర్టు కేసులు తొలగిపోయినప్పటికీ, ఇప్పటికీ అక్కడ ఎన్నికల నిర్వహణపై ముందడుగు పడకపోవడంపై స్థానిక టీడీపీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని బాపట్ల, పొన్నూరు, నరసరావుపేట, మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో 2014 తర్వాత అసలు ఎన్నికలే జరగని పరిస్థితి నెలకొంది. దీనివల్ల 2019 నుంచి ఈ పట్టణాల్లో ప్రజాపాలన అనేది లేకుండా పోయి, ప్రత్యేక అధికారుల పాలనే నడుస్తోంది. నరసరావుపేట పరిధిలో విలీన గ్రామాలపై ఉన్న కేసులను టీడీపీ నాయకులు ఉపసంహరించుకున్నప్పటికీ, వైసీపీ నేతలు తమ కేసులను ఉపసంహరించుకోకపోవడంతో కోర్టు వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది.
ఈ రాజకీయ చదరంగం వల్ల విలీన ప్రతిపాదనల్లో ఉన్న దాదాపు 110 పంచాయతీల్లో 2018 నుంచే ప్రత్యేక అధికారుల పాలన సాగుతుండగా, 2021లోనూ అక్కడ స్థానిక ఎన్నికలు జరగలేదు. కోర్టు వివాదాలు, జీవోల చిక్కుల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, మున్సిపల్ గ్రాంట్లు రాక పట్టణాల్లో పారిశుధ్యం, డ్రెయినేజీ, రహదారులు, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం తక్షణమే చట్టసవరణలు చేసి, కోర్టు చిక్కులు తొలగించి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


