ఉత్తరాంధ్ర అతలాకుతలం
- 80 ప్రాంతాల్లో 100 మి.మీ.కు పైగా వర్షపాతం
- ఉధృతంగా వంశధార, నాగావళి…గోదావరికీ వరద
- అనేకచోట్ల రోడ్లకు గండ్లు…దెబ్బతిన్న కల్వర్టులు
- వాగులు, వంకలు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం
- విమానాల దారి మళ్లింపు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కళింగపట్నం వద్ద తీరాన్‌ని దాటింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ముఖ్యం గా ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. విశాఖ పట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. అనేకచోట్ల రహదారులు నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ ప్రవాహానికి కల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఉత్తరాంధ్రతో పాటు, ఉభయగోదావరి, కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 613 కిలోమీటర్ల ఆరఅండ్బీ రహదారులు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేలింది. ఇందులో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 356 కి.మీ. రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. తాత్కాలిక, శాశ్వత మరమ్మతులకు సుమారు రూ.251.68 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. నాలుగు ప్రాంతాల్లో రహదారులు తీవ్రంగా కొట్టుకుపోవడం, లోతైన గుంతలు ఏర్పడటం, 78 కల్వర్టులు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రితోపాటు, ఇరిగేషన్, విద్యుత్, ఆరఅండ్బీ శాఖల మంత్రులు వేర్వేరుగా సమీక్షలు జరిపి, వరద ప్రాంతాల్లో సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన చర్యలకు ఆదేశించారు.
రోడ్లపై వరద నీరు… రాకపోకలు బంద్
విజయనగరం జిల్లాలో చంద్రంపేట-వసంత రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. అనకాపల్లి-చోడవరం ప్రధాన రహదారులపై కూడా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా గంగవరం గ్రామం వద్ద కాలువపై ఉన్న కల్వర్టు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. టెక్కలి మండలంలో వాగు పొంగిపొర్లడంతో పెదరాకళ్లపల్లి, సీతారాంపల్లి, రామనగరం గ్రామాలకు రహదారి సంబంధాలు తెగిపోయాయి.అల్లూరి జిల్లాలో హుకుంపేట మండలం చీడిమెట్టు వద్ద వంతెనపై నుంచి వరదనీరు ప్రవహించింది. అనంతగిరి ఘాట్రోడ్డుపై చెట్లు కూలడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పార్వతీపురం మన్యం జిల్లాలో చెరువులు, కాలువలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
వంశధార, నాగావళికి తొలి వరద హెచ్చరిక
భారీ వర్షాలతో ఉత్తరాంధ్రలోని ప్రధాన నదుల్లో ప్రవాహం పెరుగుతోంది. వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తొలి వరద హెచ్చరిక జారీ చేశారు. బహుదా, మహేంద్రతనయ నదుల ప్రవాహాలను కూడా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గోదావరి నదికీ వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.మరోవైపు మున్నేరు, బుడమేరు, ఏలేరు పరివాహక ప్రాంతాల్లోనూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని పట్టణాలు ఎడతెరపిలేని వర్షంతో రహదారులు చెరువులుగా మారాయి. భారీ వర్షాలకు గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల్లోని T కాలనీలు నీటమునిగాయి. కుంచుమాంబ కాలనీ, నాతయ్యపాలెం, హౌసింగ్బోర్డు కాలనీ, షీలానగర్, హరిజన జగ్గయ్యపాలెం ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో సింగవరం-తాళ్లపాలెం రహదారిలో రైల్వే అండర్‌పాస్లోకి రెండు అడుగులకు పైగా నీరు చేరింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వద్ద చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలోనూ భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. రహదారులు నీటితో నిండిపోయాయి. వాహనదా రులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం నుంచి విజయవాడ రావల్సిన ‘ఇండిగో’ విమానం దిగే అవకాశం లేక శంషాబాద్‌కు దారిమళ్లింపు చేశారు. అలాగే శంషాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన ‘స్టార్ ఎయిర్‌లైన్స్’ విమానం బెంగళూరుకు మళ్లించారు.


