అమెరికా, ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక
న్యూయార్క్/తెహ్రాన్: అమెరికా`ఇజ్రాయిల్ మరోసారి తమ దేశంపై దాడికి దిగితే మాత్రం యుద్ధం తీవ్రతరమవుతుందని, హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తుందని ఇరాన్ హెచ్చరించింది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, హోర్మూజ్ నుంచి ఎర్ర సముద్రం పరిధిలో ఘర్షణలు జరుగుతున్నాయని, పరిస్థితి తీవ్రతరం అయితే మాత్రం పరిణామాలు సైతం అంతే తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీకి సలహాదారుడు యాహ్యా రహీం సఫావీ స్పష్టం చేశారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని ఇరాన్ మీడియా విడుదల చేసింది. హిందూ మహా సముద్రం వరకే యుద్ధం ఆగిపోతుందని భావించవద్దని కూడా యాహ్యా వెల్లడించారు. వాణిజ్య నౌకలు, సైనిక స్థావరాలు లేదా నిర్దిష్ట దేశాలను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు లేకపోలేదని అని సూచనప్రాయంగా వీడియోలో చెప్పినట్లు తెలిసింది.
బెదిరింపులు కాదు… చర్చలే మార్గం: పెజెష్కియాన్
అమెరికా, న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరైన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ‘అమెరికా ఒత్తిడికి ఇరాన్ లొంగబోదు’ అని స్పష్టం చేశారు. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న హెచ్చరికలను తిరస్కరించారు. యుద్ధానికి ముగింపు పకాలని సూచించారు. అందుకు దౌత్య పరిష్కారానికి ఇరాన్ సిద్ధమని తెలిపారు. ట్రంప్ బెదిరింపు ధోరణిని విడనాడాలని పెజెష్కియాన్ సూచించారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా ఇరాన్‌పై ముద్ర వేయడాన్ని ఖండించారు. ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ ఇరాన్ ప్రజలపై దాడులు చేస్తున్నారని, తాము కూడా ఉగ్రవాదానికి బాధితులమేనని పెజెష్కియాన్ వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఇరాన్ ప్రతిఘటిస్తోందని…ఒత్తిడికి తలొగ్గేది లేదన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య చర్చలకు అవకాశం ఉందని, అందుకు ఇరాన్ సానుకూలమేనని, బెదిరింపులను విడనాడి పద్ధతిగా ముందుకొస్తే శాంతికి అవకాశం ఉంటుందని అమెరికాకు హితవు పలికారు. అణ్వస్త్రాలు తయారు చేయం కానీ అణుశక్తి అభివృద్ధి చేసుకొనే హక్కును కాదనలేదరని కూడా అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ పెజెష్కియన్ ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ మాజీ అధినేత ఆయాతుల్లా అలీ ఖామేనీ చిత్రపటాన్ని, మరణించిన పిల్లల చిత్రాలను ఆయన ఐరాస వేదికపై ప్రదర్శించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా అమెరికా అడ్డుకుంటుందన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. తమ దేశ పౌర అణు కార్యక్రమంపై పరిమితులను అంగీకరించబోమని పెజెష్కియాన్ తెలిపారు. అమెరికాతో చర్చలకు సిద్ధమన్నారు. బెదిరింపులు కాదు… చర్చలే మార్గమంటూ ట్రంప్‌కు సూచన చేశారు. సంభాషణ, దౌత్యం, చర్చలకు సిద్ధంగా ఉన్నామని పెజెష్కియన్ అన్నారు.


