పీపీపీ విధానంతో కీర్తి శిఖరానికి
దేశ, విదేశీయులను ఆకర్షించేలా ప్రత్యేక సర్క్యూట్లు
ఆదాయాన్ని సమకూర్చేలా ప్రైవేట్ పెట్టుబడులు
అధికారుల సమీక్షలో భట్టి
విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధి అంటే … పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాదని, తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం కూడా అందులో భాగమేనని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులు, ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచుతూ రాష్ట్ర పర్యాటక రంగాన్ని కీర్తి శిఖరానికి తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా భవన్‌లో గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక, సాంస్కృతిక శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యాటక ప్రాజెక్టులు, శాఖ పరిధిలోని ఆస్తుల వినియోగం, బడ్జెట్ కేటాయింపులు, ప్రైవేట్ పెట్టుబడులు, చారిత్రక కట్టడాల పరిరక్షణ, పర్యాటక బ్రాండింగ్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పర్యాటక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని విస్తృతం చేయాలని, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటక శాఖకు చెందిన ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. భవనాలు, ఖాళీ స్థలాలు పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించాలని ఆదేశించారు. ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హిల్ టూరిజం తదితర విభాగాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని అన్నారు. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పర్యాటక పటంలో నిలిపేలా బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. హోటళ్లు, రిసార్టుల అభివృద్ధికి ప్రైవేట్ భాగస్వామ్యం చేయాలని సూచించారు. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను కాపాడాలన్నారు. రామప్ప వంటి చారిత్రక ప్రదేశాల పరిరక్షణకు సహకారం అందిస్తామన్నారు. విద్యార్థుల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రాంతాలపై అవగాహన పెంచేందుకు ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమాన్ని నిర్వహించాలని, మ్యూజియంలు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా వీరికి అవగాహన కల్పించాలని సూచించారు. పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి అవసరమైన చోట అన్ని శాఖల అధికారులతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమన్వయంతో పనిచేసి, నిర్ణీత కాలవ్యవధిలో కార్యాచరణను అమల్లోకి తేవాలని సూచించారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి, ఫైనాన్స్ ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఫైనాన్స్ సెక్రటరీ స్నిగ్ధా పట్నాయక్ పాల్గొన్నారు.


