నేడు కేరళంలోని నిలంబూర్‌లో అవార్డు ప్రదానం
విశాలాంధ్ర – హైదరాబాద్: ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ మహమ్మద్-2026’ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్(ఉత్తమ ప్రజాసేవకుడు) అవార్డుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంపికయ్యారు. కేరళంకు చెందిన దిగ్గజ కాంగ్రెస్ నేత ఆర్యదాన్ మహమ్మద్ స్మారకారœం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టి గల నాయకత్వానికిగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు. ఎంపీ బెన్నీ బెహన్న, కేరళం రెవెన్యూ శాఖ మంత్రి ఏపీ అనిల్‌కుమార్, ప్రముఖ మేధావి కల్పెట్టా నారాయణన్ జ్యూరీగా వ్యవహరించారు. ప్రజాస్వామిక విలువలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధతను జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది. ఆర్యదాన్ మహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళంలోని నిలంబూర్‌లో శుక్రవారం ఉదయం అవార్డును రేవంత్ రెడ్డికి ప్రదానం చేస్తారు. పురస్కారం కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్… ఆర్యదాన్ మహమ్మద్ స్మారక ఉపన్యాసం చేస్తారు. ఆర్యదాన్ మహమ్మద్ 8 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు వివిధ శాఖలకు మంత్రిగా సేవలందించారు. రాజనీతిజ్ఞుడైన ఆర్యదాన్ మహమ్మద్ దూరదృష్టి గల నేతగా, అద్భుతమైన పార్లమెంటేరియన్‌గా, సమర్థుడైన పాలకుడిగా, కార్మిక వర్గ ఛాంపియన్‌గా కేరళం ప్రజల మదిలో నిలిచిపోయారు.


