Homeతెలంగాణతెలంగాణలో భారీ పెట్టుబడుల సదస్సు..'ఇన్వెస్ట్‌ తెలంగాణ'కు ముమ్మర సన్నాహాలు!

తెలంగాణలో భారీ పెట్టుబడుల సదస్సు..’ఇన్వెస్ట్‌ తెలంగాణ’కు ముమ్మర సన్నాహాలు!

- Advertisement -

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబరులో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ పేరుతో నిర్వహించనున్న గ్లోబల్‌ సమిట్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్టోబరు నెలాఖరు నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో.. సదస్సు వేదిక ఏర్పాట్లతోపాటు ఫ్యూచర్‌ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగం పుంజుకున్నాయి. సదస్సుకు సంబంధించిన అంతర్గత ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షిస్తోంది.
మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల వివరాలతోపాటు దిల్లీలో నిర్వహించే ముందస్తు సదస్సులకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే గ్లోబల్‌ సమిట్‌ కోసం స్కిల్స్‌ యూనివర్సిటీలో వేదికల ఏర్పాటు పనులు చేపట్టారు.

ప్రతినిధుల బసకు ప్రత్యేక బృందం
ఈ సదస్సుకు 30 నుంచి 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల బసతోపాటు ఫ్యూచర్‌ సిటీలో తాత్కాలిక వసతుల ఏర్పాటుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫ్యూచర్‌ సిటీలో లోపల, వెలుపల జరిగే రోజువారీ కార్యక్రమాలను సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని కూడా తాత్కాలికంగా నియమించారు.రహదారులు, విద్యుదీకరణ, సమాచార వ్యవస్థల ఏర్పాట్ల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అక్టోబరు నెలాఖరులోపు ఫ్యూచర్‌ సిటీలోని అంతర్గత రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. రహదారి డివైడర్ల మధ్య ఏర్పాటు చేయాల్సిన స్తంభాలను ఇప్పటికే తీసుకొచ్చారు. వాటికి వారం రోజుల్లో విద్యుత్‌ లైన్లను అనుసంధానం చేయనున్నారు.

సరికొత్త సమాచారంతో ఎఫ్‌సీడీఏ వెబ్‌సైట్
సదస్సు సమయంలో నిరంతరంగా పనిచేసే ఇంటర్నెట్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి టీ-ఫైబర్‌ నెట్‌వర్క్‌ను వినియోగించనున్నారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పరిధిలో ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఎఫ్‌సీడీఏ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ వెబ్‌సైట్‌ను జూన్‌ 10న లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా ఫ్యూచర్‌ సిటీ అధికారులు వెబ్‌సైట్‌ను నవీకరించి.. అందులో సరికొత్త సమాచారాన్ని చేర్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు