డా॥ సూర్యదేవర రామకృష్ణ
దాదాపు తొమ్మిది దశాబ్దాల విరామం తర్వాత దేశంలో కులాల లెక్కింపు మళ్లీ తెరపైకి వచ్చింది. రాబోయే జనాభా గణనలో కులాల వారీ వివరాలను సేకరించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండటంతో, ఇది కేవలం జనాభా లెక్కల ప్రక్రియగా కాకుండా దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక పరిణామంగా మారబోతోంది. ఎవరి జనాభా ఎంత? వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ సంక్షేమం, రిజర్వేషన్ల ప్రయోజనాలు ఎవరికి ఎంతవరకు అందుతున్నాయి? అనే ప్రశ్నలకు గణాంకాల ఆధారంగా సమాధానాలు లభించే అవకాశం ఏర్పడింది. దేశం ఇప్ప్పుడు కీలకమైన మలుపు దగ్గర నిలబడింది. 1931 నాటి పాత లెక్కల తర్వాత దాదాపు తొమ్మిది దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ విరామం అనంతరం, రాబోయే జనాభా గణనలో కులాల లెక్కింపును చేపట్టేందుకు సన్నాహాలు వేగవంతమవుతున్నాయి. ఇప్పటికే ఇళ్ల గణన ప్రక్రియ ప్రారంభమై, తదుపరి దశలో జనాభా, కుల వివరాల నమోదు దిశగా అడుగులు పడుతున్నాయి. ఐతే కులగణనను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన విజ్ఞప్తులను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చడం, సమాజంలో ఎవరు ఎంత వెనుకబడి ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చారిత్రక పరిణామాల నేపథ్యంలో దేశం ముందు ఒకే ఒక ప్రశ్న నిలుస్తోంది. కేవలం రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం సంపూర్ణమవుతుందా ? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో ఒక చారిత్రక నిజాన్ని అంగీకరించక తప్పదు. భారతదేశంలో రిజర్వేషన్ల వ్యవస్థే గనుక లేకపోతే నేడు లక్షలాది దళిత, ఆదివాసీ, బహుజన కుటుంబాల నుంచి మొదటి తరం వైద్యులు, ఇంజినీర్లు, ఐఏఎస్ అధికారులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు సమాజంలోకి వచ్చేవారు కారు. వెయ్యేళ్ల సామాజిక వివక్షను, అసమానతలను సరిదిద్ది అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని ప్రసాదించడానికి రాజ్యాంగ నిర్మాతలు అందించిన శక్తిమంతమైన సాధనం రిజర్వేషన్. రిజర్వేషన్ సామాజిక సమానత్వానికి తలుపులు తెరిచే తాళం చెవి మాత్రమే. ఆ తలుపు దాటి లోపల నిలదొక్కుకోవడానికి నాణ్యమైన విద్య, ఆర్థిక బలం, సామాజిక భద్రత అత్యవసరం. అవి లేనప్పుడు కేవలం తాళం చెవి ఉన్నా అందరికీ న్యాయం జరగదన్నది చేదు నిజం. మరోవైపు వివిధ కమిషన్లు, ప్రభుత్వాల వద్ద ఉన్న అధికారిక గణాంకాలూ చేదు సత్యాన్నే వెల్లడిస్తున్నాయి. ఓబీసీ కోటా ప్రయోజనాలలో సింహభాగాన్ని వేళ్ల మీద లెక్కపెట్టే కొన్ని ప్రభావిత కులాలు మాత్రమే పొందాయని, ఆ జాబితాలో ఉన్న దాదాపు 37 శాతానికి పైగా కులాలకు ఇప్పటివరకు ఎలాంటి చట్టబద్ధ లబ్ధి అందలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కోటా అమలులో ఉన్నప్పటికీ, వాటి ఫలాలు సమాజంలో చివరి వరుసన ఉన్న నిరుపేదలకు సమానంగా అందడం లేదని స్పష్టమవుతోంది. ఒకవైపు రిజర్వేషన్లు కొనసాగుతున్నా, పక్కా సమాచారం లేకపోవడం వల్ల ఏ కులానికి ఎంత ప్రాతినిధ్యం దక్కిందో తెలియని గందరగోళం దశాబ్దాలుగా పాలనా వ్యవస్థల్లో కొనసాగుతోంది.
ఈ లోపాలను సరిదిద్దే క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలలో ఉపవర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఒక విప్లవాత్మక మలుపుగా మారింది. గతంలో ఉన్న పాత ఉత్తర్వులను పక్కనపెట్టి, రాజ్యాంగబద్ధమైన రక్షణలు నిజమైన బాధితులకు చేరాలనే ఉద్దేశంతో ఇచ్చిన ఈ తీర్పు తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా ప్రతిధ్వనించింది. దశాబ్దాలుగా ఉపవర్గీకరణ కోసం సుదీర్ఘ పోరాటం చేసిన మాదిగ సామాజిక వర్గానికి ఇది ఊరటనిచ్చింది. తెలంగాణ వంటి రాష్ట్రాలు తక్షణమే ఎస్సీ వర్గీకరణ దిశగా చట్టబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గం సుగమం చేసింది. అదే సమయంలో ఈ వర్గాల్లోనూ ఆర్థికంగా, సామాజికంగా స్థిరపడిన క్రీమీలేయర్‌ను గుర్తించి, అసలైన పేదలకే ప్రయోజనం దక్కేలా చూడాలన్న తీర్పులోని అంతర్‌సూత్రం రిజర్వేషన్ల పరిధిలోనే ఇంకా ఎంతో అన్యాయం దాగి ఉందనే నిజాన్ని బాహాటంగానే ఎత్తిచూపుతోంది. దీనికితోడు, తొంభైల నాటి ఇందిరా సాహ్నీ కేసు నిర్దేశించిన 50 శాతం పరిమితిని పూర్తిగా తొలగించాలని లేదా సవరించాలని చట్టసభలపై , న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే 69 శాతం కోటాను అమలు చేస్తుండగా, ఇతర రాష్ట్రాలు సైతం తమ జనాభా నిష్పత్తికి అనుగుణంగా పరిమితిని పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక, యాభై శాతం పరిమితి అనే సూత్రం సడలిందనే వాదన రాజకీయ వర్గాల్లో మరింత బలపడింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్త కులగణన పూర్తయి, ప్రతి కులానికి సంబంధించిన జనాభా లెక్కలు అధికారికంగా బయటకు వస్తే, జనాభా ప్రాతినిధ్యం బట్టే కేటాయింపులు అనే డిమాండ్ దేశమంతటా తీవ్రరూపం దాల్చడం ఖాయం. అప్పుడు చట్టసభలు, సమగ్ర న్యాయవ్యవస్థ పెద్ద పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగాల ప్రవేశ స్థాయిలో రిజర్వేషన్లు లభిస్తున్నప్పటికీ, ఉన్నత న్యాయస్థానాల నియామకాలు, విశ్వవిద్యాలయాల ఉపకులపతుల ఎంపికలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పదోన్నతుల్లో వెనుకబడిన వర్గాల భాగస్వామ్యం ఎందుకింత తక్కువగా ఉందనే ప్రశ్న పార్లమెంట్ సాక్షిగా పునరావృతమవుతూనే ఉంది. కోటా సీటు దక్కినా, నాణ్యమైన పాఠశాల విద్య కొరవడటం, ఇంగ్లీషు మాధ్యమ అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, హాస్టల్ వసతులు లేకపోవడం వల్ల ఉన్నత చదువులను మధ్యలోనే వదిలేస్తున్న గ్రామీణ విద్యార్థుల సంఖ్య తక్కువేమీ కాదు. పైగా దేశంలో ప్రైవేటీకరణ విస్తరిస్తున్న కొద్దీ పబ్లిక్ సెక్టార్‌లోని రిజర్వ్ ఉద్యోగాల సంఖ్య నానాటికీ కుంచించుకుపోతోంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోటాతోనే సర్వస్వం సాధ్యం కాదు. భూమి హక్కులు, నాణ్యమైన ఉచిత విద్య, ఆధునిక ఆరోగ్య రక్షణ, ఆర్థిక స్వయం సమృద్ధి, అన్నిటికీ మించి ఆత్మగౌరవంతో బతికే వాతావరణం లభించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాకారమవుతుంది. దానికి ముందుగా పారదర్శకమైన కులగణన గణాంకాలు ప్రాతిపదిక కావాలి. ఆ డేటా ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరేలా వర్గీకరణ, క్రీమీలేయర్ విధానాలను పటిష్టంగా అమలు చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందిస్తూనే, ప్రైవేటు రంగానికి అవసరమైన వ్యాపార, రుణ అవకాశాలను ప్రోత్సహించాలి.
సెల్ : 9490754169


