Homeవిశ్లేషణపెట్టుబడిదారీ వ్యవస్థలో పేదరికం ఏమౌతుంది

పెట్టుబడిదారీ వ్యవస్థలో పేదరికం ఏమౌతుంది

- Advertisement -

పి.పి.శాస్త్రి

లోకంలో ఒక పక్క దారిద్య్రం, ఆకలి, ఈతి బాధలు ఉంటే మరొక పక్క ఐశ్వర్యం, విందులు, ఆనందాలు ఉంటాయి. ఆనాటి సినిమాల నుండి ఈనాటి చిత్రాల వరకూ గొప్ప, బీద తారతమ్యాలు చూపించడం, ఒకసారి బీదవాడిని హీరో చేయడం, మరొకసారి గొప్పవాడిలో ఆదర్శం చూపడం సినిమా అభ్యుదయం. కొంత కాలం ధనవంతుడు మారిపోయి పరివర్తన చెందినట్లు చూపించడం ట్రెండ్. ఆ తరువాత బీదవారందరూ కలిసికట్టుగా ధనవంతుడి మీద దాడి చేయడం, ధనవంతుడు పారిపోవడం, సోషలిస్టు తరహా క్లైమాక్స్. ఇప్పుడు బీదవాడు తన తెలివితేటలతో చాలెంజ్ చేసి ధనవంతుడిగా మారిపోవడం కార్పోరేట్ స్టయిల్ సోషలిజం. అన్నింటిలోనూ గొప్ప, బీద తారతమ్యాలు మనకు కనపడుతూనే ఉంటాయి. గొప్పవాళ్ల కాలనీలు వేరు. బీదవాళ్ల పేటలు వేరు. గొప్ప వాళ్ల స్కూళ్లు వేరు. బీద వాళ్ల బడులు వేరు. గొప్ప వాళ్ల షాపులు వేరు. బీద వాళ్ల అంగడి కొట్లు వేరు. గొప్ప వాడి రెస్టారెంట్లు వేరు. బీదవాడి హోటళ్లు వేరు. గొప్పవాడి సెలూన్లు వేరు. బీదవాడి మంగలి షాపులు వేరు. ఆఖరికి గొప్పవాడి స్పోర్ట్స్ వేరు. బీదవాడి ఆటలు వేరు. లీడర్ సినిమాలో హీరో పాదాలు చూసి ఎంతగా తెల్లగా ఉన్నాయో, నువ్వు దుమ్ములో కాలు పెట్టడమే ఉండదు కదా అంటుంది సైడు హీరోయిన్. నిజమే గొప్పవాడి పాదాలు తెలుపు. బీదవాడి పాదాలు గోధుమ రంగు. గొప్పవాడి శరీరం ముట్టుకుంటే ఎర్రగా కందిపోతుంది. బీదవాడి వళ్లు ముట్టుకుంటే చెయ్యి నలుపవుతుంది. (ఈ రంగు బేధం అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో గొప్ప, బీద తారతమ్యాన్ని చూపకపోయినా, తేడా తెలుస్తూనే ఉంటుంది.) మన స్కూళ్లలో, కాలేజీలలో గొప్ప వాళ్ల స్కూళ్లు, గొప్ప వాళ్ల కాలేజీలు స్పష్టంగా తేడా తెలుస్తుంది. గొప్ప వాళ్ల స్కూళ్లలో బీదవాళ్ల పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వకుండా ఉండడానికి ఆ స్కూళ్ల ఫీజులు ఆకాశన్నంటుతాయి. అంటే ఆ స్కూళ్లలో పిల్లలకు పేదరికం అనేది తెలియకుండా, పేదవాళ్లు కనపడకుండా ఉంచటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ మధ్య దిల్లీలో ఒక అంతర్జాతీయ సమిట్ జరిగినప్పుడు, విదేశీ ప్రతినిధులకు దిల్లీ మురికివాడలు, పేదవాళ్లు కనపడకుండా పరదాలు కట్టడం, ఆంక్షలు విధించడం అధికారులు చేశారు. మరొకమారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మహాశయుడు వచ్చినప్పుడు ఆయన ప్రయాణించే రోడ్లకు ఇరువైపులా గోడలు కట్టి, దిల్లీ పేదరికం కనపడకుండా ఉంచటానికి ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలో ఈ బీద గొప్ప తారతమ్యాలు ప్రస్పుటంగా కనిపించకుండా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లు మధ్య తరగతి నివాసాల కోసం మొదలయ్యాయి. కానీ ఇప్పుడు అపార్ట్‌మెంట్లు, ఆకాశహర్మ్యాలుగా మారిపోయి, సదుపాయాల పేరుతో కోట్లకు పడగలెత్తి ధనవంతుల కోటలయ్యాయి. అపార్ట్‌మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలుగా మారిపోయి ధనవంతుల రాజప్రసాదాలుగా మారిపోయాయి. సెక్యూరిటీ పేరుతో వారిని వారే బంధించుకుని దానిని హైక్లాస్ లివింగ్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరొక అడుగు ముందుకు వేసి విల్లాలు తయారయ్యాయి. నగరానికి దూరంగా, పల్లెటూరి పక్కన పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చి లోపలే ఒక నగరం నిర్మించుకుని, పూర్తి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని, విదేశీ కల్చర్లో గొప్పగా నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విల్లాలలోను, గేటెడ్ కమ్యూనిటీలలోనూ, బీదరికం నీడలు, ఆకలి, ఈతిబాధలు, కనీసం ఆలోచనలోకి గానీ, ఊహలలోకి గానీ రానే రావు. ఇవి పెట్టుబడిదారీ వ్యవస్థ పరిపూర్ణ నిర్మాణానికి అవసరమైన కేంద్రాలు. పెట్టుబడిదారీ సమాజం ప్రధాన లక్షణం పేదరికం కనపడకుండా చేయడం. కెనడా, అమెరికాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ అంత పటిష్టంగా ఉండడానికి కారణం అక్కడ సమాజాలలో బీదరికాన్ని, బీదవారిని, సమాజం నుండి వేరు చేయడమే. ఆ దేశాలలో చిన్న వ్యాపారాలు, చిన్న వ్యవసాయాలు లేకుండా చేశారు. అన్నీ కార్పోరేట్ వ్యాపారాలు, అంతా కార్పోరేట్ వ్యవసాయం. అక్కడ పేదవాళ్లను హోంలెస్ అని పిలుస్తారు. వారు ప్రత్యేక ఏరియాలో ఉంటారు. వారికి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది. వారికి గంజాయి, డ్రగ్స్ అలవాటు అవుతుంది. వారిని సంస్కరించే ప్రయత్నాలు గానీ, వారి జీవన విధానం మార్చి వారి జీవితాలను మార్చే ప్రయత్నం గానీ జరగదు. ఇప్పుడు మన దేశంలో కూడా అటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణానికి అవసరమైన అన్ని మార్గాలను అవలంభిస్తున్నారు. చిన్న వ్యాపారాలు పోతున్నాయి. షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్, మల్టీప్లెక్స్‌లు పెరిగిపోయి, సెల్‌ఫోన్లు, ఆన్‌లైన్ షాపింగ్, విలాసవంతమైన జీవితం అలవాటు అయిపోయి, సాధారణ జీవనం సాధ్యం కాకుండా పోతోంది. పెట్టుబడిదారీ విధానంలో పేదరికాన్ని నిర్మూలించడం అంటే పేదరికం కనపడకుండా చేయడం. పేదరికం లేకుండా చేయడం, పేదలకు అవకాశాలు కల్పించి వారిని కనీస స్థాయికి తీసుకురావాలని ప్రయత్నం చెయ్యడం పెట్టుబడిదారీ విధానంలో సాధ్యం కాదని మిగిలిన పెట్టుబడిదారీ దేశాల అనుభవాలు మనకి తెలియచేస్తాయి. మన దేశం కూడా అదే పంధాలో నడుస్తోంది అనడానికి పూర్తి ఉదాహరణలు కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారీ దేశాలలో ప్రజల, యువత, విద్యార్థుల ఆలోచనలు చాలా వేరుగా ఉంటాయి. వారి ఆలోచనలలో అసమానతలు, సమానత్వం, సౌభ్రాతృత్వం, సహకారం, బీదరికం, మొదలైనవి రాకుండా అక్కడ పరిస్థితులు సృష్టించబడి ఉంటాయి. స్వార్థం అని పూర్తిగా అనలేము గానీ వారి ఆలోచనలు వారి అవసరాల చుట్టూ మాత్రమే తిరుగుతాయి. వారు ఇతరుల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు. ఇతరులకు ఉన్న బీదరికం వారి కృషి లోపం అని మాత్రమే భావిస్తారు. వ్యవస్థలో ఉన్న దోపిడీ, అసమానతలు, అవకాశాల లోపం, వంటివి వారు నమ్మరు. మేము బంగారు స్పూన్‌తో పుట్టాము, మేము తెలివితేటలతో పుట్టాము, అందుకే మేము వేరు అన్నట్లుగా వారి ఆలోచన ఉంటుంది. ఈ రకమైన మనస్తత్వం, ఆలోచన మన ప్రజలు, యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లలో, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న వారిలోనూ, బహుళంతస్తుల అపార్ట్మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీలలో, విల్లాలలో ఈ రకమైన మనస్తత్వం, ఆలోచన విధానం ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. దానికి కారణం వాళ్లు, మిగతా సమాజానికి దూరంగా ఉండడం ప్రధాన కారణం అయితే, వారు ఉంటున్న సమాజం అటువంటి భావనలను ప్రచారం చేయడం, దానికి వారు ప్రభావితం కావడం జరుగుతోంది. ఇది అంతా సమాజాన్ని నిలువుగా రెండు భాగాలుగా విభజించి చూపిస్తోంది. ఒకటి ధనికస్వామ్య సమాజం, మరొకటి అణగారిన, దోపిడీకి గురయ్యే సమాజం. ఈ రెండు సమాజాలు సమాంతరంగా ఉంటూ ఒకదానికొకటి తారసపడకుండా నడుస్తున్నాయి. ఈ పరిస్థితులు భారతదేశ ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగంలో రాసుకున్న సామ్యవాదానికి, సమభావనకు, సోదర భావానికి అనుకూలమైనవి కావు. మన దేశ అభ్యున్నతి కోసం, మన ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మన ప్రజల ఆలోచనా విధానం మారాలి. ప్రజలందరూ ఒకే సమాజంగా, ఒకే సంస్కృతి, సంప్రదాయాలు పాటించాలి. ప్రజలందరి మధ్య సమానత్వం, సామరస్యం, సౌభ్రాతృత్వం ఉండేలా కృషి చెయ్యాలి. ఫోన్ : 9885286643

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు