ఏఐవైఎఫ్ గ్రామ అధ్యక్షులు లింగన్న డిమాండ్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్డు పనులు తక్షణమే చేపట్టాలని ఏఐవైఎఫ్ గ్రామ అధ్యక్షులు లింగన్న డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని నెలలు కింద చిన్నతుంబళం గ్రామం నుంచి ఆదోనికి వెళ్లే ప్రధాన రహదారి వరకు బీటీ రోడ్డు పనులను చేపట్టడం జరిగిందన్నారు. కానీ ఇంత వరకు పూర్తి చేయకుండా మధ్యలోనే పనులు నిలిపివేశారని విమర్శించారు. దీంతో ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా రోడ్డు పనులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని లేనిపక్షంలో ఆర్ అండ్ బి కార్యాలయం ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.


