త్వరలో చర్యలు చేపడతాం: ట్రంప్ మళ్లీ హెచ్చరిక
ఎన్నికల ముందే దాడులు జరగవచ్చన్న అంచనాలు
వాషింగ్టన్: ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు హెచ్చరికలు చేశారు. నవంబరులో జరగబోయే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై సైనిక చర్యలు ఉంటాయని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు మాట మార్చారు. ‘ఇరాన్‌కు ఏం చేస్తామో చూడండి… త్వరలోనే మా చర్యలు ఎలా ఉంటాయో చూస్తారు’ అంటూ అలాస్కాలో నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఇరాన్‌కు గట్టి సమాధానం ఇస్తాం. అణ్వాయుధాన్ని తయారు చేయనివ్వం. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండటం అన్నది ఎప్పటికీ జరగదు. ఆ అణు కార్యక్రమం వేల టన్నుల రాళ్ల కింద కూరుకుపోయింది’ అని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ట్రంప్ హెచ్చరించారు. తమ లక్ష్యాన్ని సాధించేందుకు చమురు ధరలు పెరిగినా భరించాల్సిందేనన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో నవంబర్ 3 (ఎన్నికల తేదీ) కంటే ముందే ఇరాన్‌పై దాడులు జరగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. యుద్ధ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని పంటగాన్కు ఆదేశాలు అందిన్నట్లు ‘యాకిస్యోస్’ వార్తా కథనం పేర్కొంది. సన్నాహాలు పూర్తి చేయాలని అమెరికా సెంట్రల్ కమాండ్‌కు సూచించినట్లు సమాచారం. అయితే దాడుల నిర్దిష్ట తేదీ గురించి తెలియలేదు. ఎన్నికలకు ముందే ఇరాన్‌పై సైనిక చర్యలు పున:ప్రారంభం కావచ్చని అమెరికా, ఇజ్రాయిల్ వర్గాలు భావిస్తున్నట్లు యాకిస్యోస్ పేర్కొంది. ఇజ్రాయిల్‌లో ఎన్నికలకు ముందు కూడా ఈ పరిణామం చోటుచేసుకోవచ్చన్న అంచనాలు ఉన్నట్లు తెలిపింది. ఇదే అంశమై ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ చర్చలు జరిపినట్లు వార్తా నివేదిక వెల్లడించింది. ఇరాన్ సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేసే దిశగా చర్చలు జరిగినట్లు అమెరికా`ఇజ్రాయిల్ అధికారులను ఉటంకిస్తూ తెలిపింది. మరోవైపు దౌత్యపరంగా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.


