రూ.20 లక్షలతో నూతన పంచాయతీ భవనం
రూ.5 లక్షలతో అండర్డ్రైనేజీ పనులు
విశాలాంధ్ర,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం కిషన్నగర్ గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి, రూ.5 లక్షలతో చేపట్టనున్న అండర్డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకర్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామంలోని 160 మంది నూతన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. దీంతో కిషన్నగర్ గ్రామంలో మొత్తం 940 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పూర్తయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ…. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, అభివృద్ధి విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు పంచాయతీ భవనం, అండర్డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


