Homeజాతీయంఎస్‌బీఐ కీలక నిర్ణయం.. గృహ, వాహన రుణాలపై వడ్డీ పెంపు

ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. గృహ, వాహన రుణాలపై వడ్డీ పెంపు

- Advertisement -


దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణగ్రహీతలపై వడ్డీ భారాన్ని పెంచింది. వివిధ రుణాలపై వడ్డీ రేట్లను సవరిస్తూ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ నూతన రేట్లు 2026 అక్టోబర్ 15వ తేదీ (నేటి) నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచిన నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) పెరగనున్నాయి.

ఎస్‌బీఐ తాజా సవరణ ప్రకారం, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR) 7.90 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. అలాగే రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) 7.50 శాతం నుంచి 7.75 శాతానికి చేరింది. ఈ రెండు రేట్లు పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) మేర పెరిగాయి. సాధారణంగా కొత్త గృహ, వాహన రుణాలు ఈ రేట్లకే అనుసంధానమై ఉంటాయి కాబట్టి, ఈ రుణాల ఈఎంఐలు తక్షణమే పెరగనున్నాయి.

వీటితో పాటు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను కూడా ఎస్‌బీఐ సవరించింది. మూడు నెలలు, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌పై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల (0.15%) మేర పెంచింది. దీంతో ఏడాది కాలపరిమితి గల ఎంసీఎల్‌ఆర్ 8.70 శాతం నుంచి 8.85 శాతానికి చేరుకుంది. పాత గృహ రుణాలు, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు ఎక్కువగా ఎంసీఎల్‌ఆర్‌తో ముడిపడి ఉంటాయి. అయితే, ఓవర్‌నైట్, ఒక నెల కాలపరిమితి గల ఎంసీఎల్‌ఆర్‌లో ఎటువంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.

వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో EBLR, RLLR, MCLR ఆధారిత ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకున్న వారిపై ఈఎంఐల భారం పడనుంది. సవరించిన ఈ రేట్లను తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు