Homeజాతీయంఈ నెలలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు..

ఈ నెలలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు..

- Advertisement -

మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో ఈ బిల్లులను ఆమోదింపజేసేందుకు అవసరమైన మద్దతు తమకు ఉందని కేంద్రం ధీమాగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ అంశాలపై ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి.

ప్రతిపాదిత బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రతిపక్ష పార్టీలతోనూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. దీంతో ఈసారి బిల్లులను ఆమోదింపజేసుకోవడం కేంద్రానికి కీలకంగా మారింది.

రెండు వంతుల మెజారిటీ అవసరం
రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి పార్లమెంట్‌లో ప్రత్యేక మెజారిటీ అవసరం. లోక్‌సభలో ప్రస్తుతం 540 మంది సభ్యులుండగా, మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు కీలకం. ఈ లెక్కన సుమారు 360 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్డీయేకు లోక్‌సభలో మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన సంఖ్యాబలం విషయంలో సవాళ్లు ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వానికి మద్దతు పెరిగిందని, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎంపీలు, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార పక్షం వైపు మారారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే బిల్లుల ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలంపై తుది స్పష్టత ఓటింగ్‌ సమయంలోనే రానుంది.

డీఎంకేతో చర్చలు
బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు డీఎంకేతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో ఆ పార్టీ విభేదాలు రావడం, ఇండియా కూటమి నుంచి బయటకు రావడం నేపథ్యంలో ఈ సంప్రదింపులకు ప్రాధాన్యం ఏర్పడింది. మరికొన్ని చిన్న ప్రతిపక్ష పార్టీలతోనూ కేంద్రం మాట్లాడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఆగస్టు 13న ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ఇంకా అధికారికంగా ప్రొరోగేషన్‌ ప్రకటించలేదు. దీంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని సమాచారం. అక్టోబర్‌ 26, 27 తేదీల్లో సంవిధాన్‌ సదన్‌లో జరగనున్న 12వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరమ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. సమావేశాలకు వారం రోజుల ముందుగా నోటీసు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు