గత నెల 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. అయితే, గత నెల 29న (బుధవారం) తొక్కిసలాట ఘనట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు ఒకేసారి తరలిరావడంతో సంగం ఘాట్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దుర్ఘటనపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు. కాగా, దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ పిల్ ను స్వీకరించడానికి నిరాకరించింది. ఇది ఒక దురదృష్టకర సంఘటనగా సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే పిల్ వేసిన న్యాయవాదిని తన పిటిషన్‌తో అలహాబాద్ హైకోర్టుకు తరలించాలని న్యాయస్థానం సూచించింది. అటు ఈ తొక్కిసలాట ఘటనపై స్పందించిన యూపీ ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇందులో భాగంగా ఈ ఘటనపై పార్లమెంట్‌లో విచారణ జరపాలని, మృతుల సంఖ్యపై పూర్తి సమాచారాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు పార్లమెంట్‌లో నిరసనకు సైతం దిగాయి.
కుంభమేళా తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: సుప్రీంకోర్టు
RELATED ARTICLES