విశాలాంధ్ర – కంబదూరు: అప్పుల బాధలు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.పోలీసుల వివరాల మేరకు.. కంబదూరుకు చెందిన వడ్డే శంకర (48) కొండ ప్రాంతంలోని సమాధుల వద్ద ఉన్న షెడ్డు ఇనుప స్తంభానికి ఉరివేసుకుని మృతి చెందాడు. కొద్ది నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో శంకర తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వైద్య చికిత్స ఖర్చులతో పాటు పిల్లల చదువుల కోసం సుమారు రూ.6 లక్షల వరకు అప్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు. అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
కుటుంబానికి తీరని లోటు
శంకర మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోవడంతో భార్యాపిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని, తగిన ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


