కేంద్ర మంత్రికి సీతక్క వినతి
విశాలాంధ్ర – హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు అదనపు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రితో సోమవారం సీతక్క భేటీ అయ్యారు. చిన్నారుల కోసం అల్పాహార పథకం అమలుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల అవసరాన్ని వివరించారు. టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి కేంద్ర మంత్రితో గంట పాటు చర్చించి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 35,700 ఏడబ్ల్యుసీలు పనిచేస్తుండగా…ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఐసీడీఎస్) ద్వారా మహిళలు, పిల్లలకు సంపూర్ణ పోషణ అమలు చేయడంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 8.6 లక్షల మంది పిల్లలకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం అమలు చేయాలంటే ఏడాదికి రూ. 206 కోట్లు ఖర్చు అవుతాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో బ్రెక్ ఫాస్ట్ స్కీం అమలుకు కేంద్ర సహకారాన్ని సీతక్క అభ్యర్థించారు. చిన్నారుల పోషకాహార అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ… బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిధులు మంజూరు కు కృషి చేస్తామని హమీ ఇచ్చారు. త్వరలో తెలంగాణలో తాను పర్యటించి… మహిళా శిశు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు.