Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

మారని గిరిజన బతుకులు

నేటికీ అందని స్వాతంత్య్ర ఫలాలు..
విద్య, వైద్యం అందని ద్రాక్షే
పాలకుల హామీలు నీటిపై రాతలు

విశాఖపట్నం : డిజిటల్‌ ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతుందని ఢంకా బజాయించి చెబుతున్న పాలకులకు గిరిజన ప్రాంత అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లోనూ గిరిజన గ్రామాలు విస్తరించి ఉన్నాయి. ఆ గ్రామాల్లో గిరిజనులు దుర్భర జీవితం గడుపుతున్నారు. విద్య, వైద్యం, రవాణా, తాగునీరు, విద్యుత్‌ వంటి కనీస మౌలిక వసతులు కానరాని వందలాది గిరిజన గ్రామాలకు స్వాతంత్య్ర ఫలాలు ఇప్పటికీ దక్కలేదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్నా గిరిజనుల బ్రతుకుల్లో మార్పు రాకపోవడం పాలకుల నిర్లక్ష్యమేనని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మన్యంలో విలువైన ప్రకృతి సంపదను కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ…గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై పాలకులకు లేదని గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్‌ ఖనిజాన్ని లాటరైట్‌ పేరిట దోచుకుంటున్నా…ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, గిరిజన ప్రాంతంలో అత్యాధునిక వసతులతో కూడిన వైద్య సేవలు అందించే ఆసుపత్రులు లేకపోవడం పాలకుల లెక్కలేనితనమే. నీటి కోసం కోటి కష్టాలు పడుతూ మైళ్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి మన్యంలో కనిపిస్తూనే ఉంది.
విశాఖ జిల్లాలోని 9 మండలాల్లో 95 వేల జనాభా గల 320 గిరిజన గ్రామాలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యం, రక్షిత మంచి నీరు అందని ద్రాక్షే. సుదీర్ఘ ప్రాంతాల నుండి గెడ్డల్లో ఊటనీళ్లు, డోలిమోతలు తప్పడం లేదు. ఏజెన్సీని ఆనుకొని ఉన్న నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్‌లో చేర్చడంలో పాలకవర్గాలు బాధ్యతగా వ్యవహరించడం లేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లాలోని మూడు వందల పైచిలుకు గిరిజన గ్రామాలను ఐదవషెడ్యూల్‌లో చేర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. వీటిని షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్పిస్తామని అధికార పార్టీ తియ్యనిమాటలు చెప్పిందేగానీ..అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. గిరిజన సలహా మండలి (ట్రైబల్‌ ఎడ్వయిజరీ కమిటీ) 112 గిరిజన గ్రామాలకు పరిమితం చేస్తూ ఏడాది క్రితం తీర్మానం చేసింది. దీనిపై గిరిజన, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగడంతో మరల తహసీల్దార్లతో క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుంటామని పాలకులు చెప్పారు. ఇది కూడా ఏడాదికాలంగా నానుతుందే తప్ప అమలుకు నోచుకోలేదు. వందశాతం గిరిజన పంచాయతీలు ఉంటేనే ప్రతిపాదనలు పంపిస్తామని, గిరిజనేతరులతో కలిసి ఉన్న గ్రామాలను పంపించేదిలేదని తహసీల్దార్లు తెగేసి చెబుతున్నారు. నిజానికి శివారు గిరిజన గ్రామాల్లో వందశాతం గిరిజనులు నివసిస్తున్నారు. దీనిని ఇప్పుడు గుర్తించకపోతే తీవ్రనష్టం జరుగుతుందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే 1956, 1976లో రెండుసార్లు రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్లో విశాఖ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో గిరిజనులకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదేవిధంగా చేస్తే గిరిజనులు నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. ప్రతి శివారు గిరిజన గ్రామాన్ని గుర్తించి తహసీల్దార్లు ప్రతిపాదనలు పంపించి జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందాలని, తరువాత అసెంబ్లీలో తీర్మానం చేసి…రాష్ట్రపతి ఆమోదం ద్వారా గిరిజన గ్రామాలను ఐదవషెడ్యూల్డ్‌లో చేర్చాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. మాయమాటలు చెప్పడం మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్‌లో చేర్చకపోవడంతో ఆ గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఐటీడీఏ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కోల్పోతున్నారు. 1/70 భూబదలాయింపు చట్టం వర్తించడం లేదు. స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న పాలకులు…గిరిజన గ్రామాలకు కనీస సదుపాయాలు కల్పించకపోవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img