ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా సాగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార ఎన్డీయే కూటమి బలపరిచిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం కనబరిచి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. పార్టీ రహితంగా బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో పల్లె ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారు. తొలి దశలో ఎన్నికలు నిర్వహించిన మొత్తం 3,949 పంచాయతీల్లో 760 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఫలితాల సరళి ప్రకారం కూటమి మద్దతుదారులు 2,539 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. ఇందులో టీడీపీ మద్దతుదారులు 2,325, జనసేన 189, బీజేపీ 25 పంచాయతీలను దక్కించుకున్నాయి. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 1,110 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు, రెబల్స్ కలిపి 294 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఆధిపత్యం కనిపించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వైసీపీ గట్టి పోటీనిచ్చింది. తిరుపతి జిల్లాలోని 404 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు ఎక్కువ స్థానాలు సాధించగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 66 స్థానాలకు గాను వైసీపీ 29, కూటమి 26 పంచాయతీలు గెలుచుకున్నాయి. కృష్ణా, ఏలూరు, గన్నవరం పరిధిలోనూ వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది.
రాయలసీమలో తిరుపతి మినహా మిగిలిన జిల్లాల్లో కూటమి పట్టు నిరూపించుకుంది. వైసీపీ అధినేత జగన్ సొంతూరు బలపనూరులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలవడం విశేషం. ఈ ఎన్నికల ఫలితాలపై జగన్ స్పందిస్తూ… అధికార కూటమి పోలీసులు, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపించారు. కాగా, ప్రజలు తమ ప్రభుత్వ పనితీరుకే మద్దతు పలికారంటూ కూటమి వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు నవంబర్ 29న జరగనున్నాయి.


