తమిళనాడు సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో ఆయన విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎన్నికల అఫిడవిట్లో సీఎం విజయ్ తన ఆదాయ, భూ యాజమాన్య వివరాలను పూర్తిగా, కచ్చితంగా వెల్లడించలేదని ఆరోపిస్తూ ఎస్. దినేశ్ అనే వ్యక్తి ఈ ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని, ప్రాథమిక దశలోనే కేసును కొట్టివేయలేమని జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్‌తో కూడిన ధర్మాసనం నేడు స్పష్టం చేసింది.
ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ విజయ్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆస్తుల వెల్లడిలో కొన్ని తేడాలు ఉన్నంత మాత్రాన ఎన్నికను రద్దు చేయలేరని తెలిపారు. ఈ ఆరోపణల వల్ల ఎన్నికల ఫలితం ప్రభావితమైందని నిరూపించేందుకు పిటిషనర్ ఎలాంటి పక్కా ఆధారాలు సమర్పించలేదని కోర్టుకు వివరించారు.
అయితే, ఆస్తుల వివరాలు దాచిపెట్టడం అనేది ఎన్నికల చట్టం ప్రకారం ‘అక్రమ ప్రభావం’ (Undue Influence) కిందకు వస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, విజయ్ దాఖలు చేసిన అప్లికేషన్‌ను తిరస్కరిస్తూ, ఎన్నికల పిటిషన్‌పై విచారణ కొనసాగించడానికి అనుమతినిచ్చింది. అయితే, ఈ తీర్పుతో విజయ్ ఎన్నిక రద్దు కాదని, విచారణ తర్వాత వెలువడే తీర్పు ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని స్పష్టమవుతోంది.


