ఉప ఎన్నికల ఉత్కంఠకు తెర.. చేతులెత్తేసిన వైసీపీ
విశాలాంధ్ర బ్యూరో -అమరావతి: మున్సిపల్ ఉపఎన్నికల పోరులో కూటమి సత్తా చాటింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్టీఆర్జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. వైసీపీకి తగినంత మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉన్నప్పటికీ వారు పార్టీ ఫిరాయించడంతో… అది టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కలిసి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ అయిన కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్లకు సంబంధించిన ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేశారు. 3వ తేదీన కొన్ని చోట్ల ఎన్నికలు జరగగా…మంగళవారం కొన్నింటికి జరిగాయి. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. టీడీపీకి అనుకూలంగా 26, వైసీపీకి 21 ఓట్లు వచ్చాయి. ఆది నుంచి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎంతో ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ ఎన్నికపై హైడ్రామా కొనసాగింది. వైసీపీ, టీడీపీ నేతలు తమ అనుకూల కార్పొరేటర్లతో శిబిరాల్ని ఏర్పాటు చేసుకున్నారు. గట్టి బందోబస్తు నడుమ డిప్యూటీ మేయర్ ఎన్నికను నేడు నిర్వహించారు. కూటమి అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా గెలుపొందినట్లు అధికారి ప్రకటించారు.
నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకూ తెరపడిరది. నందిగామ మున్సిపల్ చైర్మన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. టీడీపీకి 15, వైసీపీకి అనుకూలంగా మూడు ఓట్లు పడటంతో కృష్ణకుమారి విజయం సాధించినట్లు అధికారులు ధ్రువీకరించారు. టీడీపీ అధిష్ఠానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. మూడు రోజులుగా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే సౌమ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో పార్టీ అధిష్ఠానం మధ్యేమార్గంగా కృష్ణకుమారిని రంగంలోకి దింపింది.
గుంటూరు స్టాండిరగ్ కమిటీలోనూ కూటమిదే గెలుపు
గుంటూరు నగర పాలక సంస్థ స్టాండిరగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీకి చెందిన మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీ చేసి… గెలుపొందారు. టీడీపీ నుంచి ఈరంటి వర ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, నూకవరపు బాలాజీ, ముప్పవరపు భారతి, షేక్ మీరావలి గెలుపొందారు. జనసేన నుంచి దాసరి లక్ష్మీ విజయం సాధించారు.