వేసవి రాకముందే భానుడి భగభగలు
వేసవి కాలం రాకముందే భానుడి ప్రతాపం మొదలైంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణలో వచ్చే మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. మూడు రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం సమయాల్లో పొగమంచు ఉంటుందని పేర్కొంది.
రాష్ట్రంలో మంగళవారం సరాసరి కనిష్ఠంగా 18 డిగ్రీలు, గరిష్ఠంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో 37, వరంగల్లు, నిజామాబాద్‌లో 37, మహబూబాబాద్‌లో 36.1, మెదక్‌లో 35.4, కరీంనగర్‌లో 35.2, హైదరాబాద్‌లో 34.2, నల్లగొండలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వేడిగాలులు వీస్తున్నాయని, ఆ ప్రభావం వల్లే ఎండ తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక ఇప్పుడే ఎండ తీవ్ర ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్ నెలలలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని తలుచుకుంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.