జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర -అనంతపురం : జిల్లాలో విపత్కర పరిస్తితులను ఎదుర్కొనేలా ప్రణాళికలను రూపొందించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు.అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఉదయం 2024-25సంవత్సరం జిల్లాలో మాక్ వ్యాయామాలు నిర్వహించడం పై,కరువు సంభవించే సమయంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అంశాల పైన ఎన్ డి.ఆర్.ఎఫ్ బృందం తో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, కరువు సంభవించినప్పుడు సంసిద్ధత ప్రణాళికలు, సమన్వయం మరియు ప్రతిస్పందన వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.రానున్న వేసవిపరిస్థితిలను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలను కూడా సిద్ధం చేయాలన్నారు.కరవు,తదితర విపత్కర పరిస్థితులపై జిల్లా యంత్రాగాన్ని సిద్ధం చేసేందుకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేసేందుకు వాకీటాకీలను కొనుగోలు చేస్తున్నామన్నారు. అవసరమైనప్పుడు డ్రోన్ల ద్వారా కూడా సేవలను అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.వేసవిలో నీటి వనరులు ఎండి పోవడం జరుగుతుందని,వ్యవసాయం, తాగునీటి సరఫరా మరియు నీటి కొరతకు ఎక్కువగా గురయ్యే ప్రాంతాలను గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.నీటి వినియోగ పరిమితులు, పరిరక్షణ చర్యలు మరియు కరువు యొక్క మొత్తం స్థితి గురించి ప్రజలకు తెలియజేసేలా కమ్యూనికేషన్ వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు.కరువు ప్రభావాలను తగ్గించడానికి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక వ్యూహాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు.
డిఆర్ఓఏ.మలోల మాట్లాడుతూ,కరువు తదితర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా,డివిజన్,మండల స్థాయిలలో కంట్రోల్ రూములను ఏర్పాటుచేసి ఎప్పటి కప్పుడు తగు సూచనలు జారీ చేయడం జరుగుతున్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డి ఆర్ డి ఏ పి డి ఈశ్వరయ్య, హెచ్.ఎల్.సి ఎస్ ఈ రాజశేఖర్, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి,ఏపీ ఎస్పీడీసీఎల్ ఏ డి ఈ రామకృష్ణ, పశుసంవర్ధక, ఫిషరీస్, ఆర్డబ్ల్యూఎస్, ప్రజా ఆరోగ్య, ఎన్ డి ఆర్ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రవి నాయక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
విపత్కర పరిస్తితులను ఎదుర్కొనేలా ప్రణాళికలను రూపొందించాలి
RELATED ARTICLES