ఉపాధి హామీలో 200 రోజులు పనిదినాలు కల్పించాలి…
పని ప్రదేశంలో ప్రమాదాల్లో మరణిస్తే 10 లక్షలు ఎక్స్రేషియో ఇవ్వాలి…
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి డిమాండ్
విశాలాంధ్ర -అనంతపురం : ఫిబ్రవరి 24న గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ ఫీడర్ రోడ్డులో గ్రామీణాభివృద్ధి శాఖా కమిషనర్ ఆఫీసు ముందు ధర్నాకు కూలీలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏ పి వ్యవసాయ కార్మిక సంఘం పిలుపుమేరకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఉపాధి హామీలో 200 రోజులు పనిదినాలు కల్పించి, రోజు వేతనం రు.700 ఇవ్వాలి. మెటీరియల్ కాంపోనెంట్ను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. వలసలు ఆపాలని, ఉన్న గ్రామాల్లోనే పనులు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడి ఉపాధి హామీ చట్టం సాధించి కూలీలకు అందుబాటులోకి వచ్చేలా మన ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ సంఘం ఉద్యమిస్తోందన్నారు. సరియైన ఉపాధి లేక వ్యవసాయ కూలీలువలస బాట పట్టారన్నారు. ఉపాధి కూలీల చేత చేయించాల్సిన పనులను కాంట్రాక్టర్లతో, యంత్రాలతో చేయిస్తూ, పేదల కడుపులు కొడుతున్నారు. ఉపాధి హామీ పనులకోసం అధికారుల చుట్టూ తిరిగినా పనులు కల్పించడం లేదన్నారు. చేసిన పనికి నెలలు తరబడి బిల్లులు చెల్లించడం లేదన్నారు. కూలీలకు నేటికీ మన రాష్ట్రంలో చేసిన పనికి ఉపాధి హామీలో కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇంకా కోస్తా జిల్లాల్లో గ్రామాలకు, గ్రామాలే ఖాళీ అవుతున్నాయన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీలో 1 కూలిరేట్లు, వ్యవసాయ పని దినాలు తగ్గడం వలన ఉపాధి పని దినాలు పెంచాల్సిన అవసరం ఉంది అన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించాలని పథకంలో నిధులు పక్కదారి పట్టకుండా కూలీల భద్రత కోసమే వచ్చిన ఈ పథకంలోని నిధులన్నీ వారికే కేటాయించాలన్నారు.
కుటుంబ జాబ్ కార్డ్లతో నిమిత్తం లేకుండా జాబ్ కార్డు లో పేరు ఉన్న ప్రతి వ్యక్తికి.ప్రతి వయోజనుడికి విడిగా జాబ్కార్డ్ ఇవ్వాలన్నారు.
ప్రతి గ్రూపుకి పని కల్పించాలని, పని కల్పించకపోతే ఃఉపాధి భృతిఃగా సంవత్సరంలో ప్రతికూలీకి రూ.12 వేలు ఇవ్వాలన్నారు. పని ప్రదేశాలలో టెంట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, మజ్జిగ ప్యాకెట్లు తప్పనిసరిగా అందజేయాలన్నారు.పని ప్రదేశంలో ప్రమాదాల్లో మరణిస్తే 10 లక్షలు ఎక్స్రేషియో ఇవ్వాలన్నారు. వడదెబ్బ, గాయాల పాలైతే మెరుగైన ఆరోగ్య సేవలు అందించి, కోలుకునేవరకు ఉపాధి వేతనం చెల్లించాలన్నారు.
ఉపాధి హామీలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందిపై రాజకీయ పక్షపాతాలు ఆపాలన్నారు. . ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఉపాధి పనులపై ప్రతి గ్రామంలో మైక్ ప్రచారం జరగాలని . గ్రామ సభల్లో పనులు ఎంపికచేసి బహిరంగంగా వెల్లడించాలన్నారు.
మండల స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మల్లెల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు పెరుగు సంగప్ప తదితరులు పాల్గొన్నారు.