బీరు ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ను ఇచ్చింది. బీర్ల ధరలను భారీగా పెంచింది. అన్ని రకాల బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. విశ్రాంత న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ సిఫారసు చేసింది. ఆ మేరకు బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి. రానున్నది వేసవి కాలం కావడంతో బీర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీంతో, రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
అన్ని రకాల బీర్ల బ్రాండ్ల ధరలను 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీ ధరపై 15 శాతం పెంచి బీర్లను విక్రయిస్తారు. పెరిగిన ధరలతో ప్రస్తుతం రూ. 150గా ఉన్న కింగ్ ఫిషర్ ప్రీమియం బీర్ ధర రూ. 180కి చేరుకునే అవకాశం ఉంది. కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ ధర రూ. 160 నుంచి రూ. 190కి పెరగొచ్చు. అయితే, బీర్ల ధరలు సరిగ్గా ఎంత పెరుగుతాయనే విషయంలో ఈరోజు క్లారిటీ రానుంది. ఇది నిజంగా బీర్ ప్రియులకు కిక్కు దిగిపోయే వార్తే.