Tuesday, February 25, 2025
Homeస్తంభించిన మన్యం

స్తంభించిన మన్యం

అల్లూరి జిల్లాలో తొలిరోజు బంద్‌ సంపూర్ణం
. మూతబడ్డ దుకాణాలు, విద్యాసంస్థలు బ రోడ్డెక్కని వాహనాలు
. పర్యాటక ప్రదేశాలు వెలవెల
. 1/70 చట్టం జోలికొస్తే సహించం: అఖిలపక్షం

విశాలాంధ్ర బ్యూరో – పాడేరు : స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలతో మన్యం భగ్గుమంది. పర్యాటక రంగం కోసం అవసరమైతే 1/70 చట్టాన్ని సవరించాలన్న శాసనసభాధిపతి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అఖిలపక్ష గిరిజన సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ‘మన్యం బంద్‌’… అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. 48 గంటల మన్యం బంద్‌కు తొలిరోజు మంగళవారం ఏజెన్సీ వ్యాప్తంగా ప్రజలనుంచి విశేష స్పందన లభించింది. జనజీవనం స్తంభించింది. ఉదయం 4 గంటల నుంచే గిరిజన సంఘాలు, వామపక్షాల నాయకులు రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను, షాపులను మూయించారు. 1/70 చట్టాన్ని సవరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. పర్యాటకం ముసుగులో గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని… క్షమాపణ చెప్పాలని, 1/70 చట్టానికి రక్షణ కల్పించాలని, ఈ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. బంద్‌ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించారు. మరోవైపు పర్యాటక ప్రాంతాలు కూడా మూతపడ్డాయి. చిలకల గెడ్డ నుంచి అనంతగిరి, అరకు, పాడేరు, చింతపల్లి, కొయ్యల గూడెం, చింతూరు మండలం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బంద్‌ నేపథ్యంలోనే అల్లూరి జిల్లా ఏజెన్సీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలో బంద్‌ ప్రభావంతో చాలా వరకు నిర్మానుష్య వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం పాడేరు తో సహా అరకు, చింతపల్లి, సీలేరు, రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి తదితర ప్రాంతాల్లో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకున్నారు. దుకాణాలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లాలోని దాదాపు 11 మండలాల్లో కూడా బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బంద్‌ నేపథ్యంలో ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను వాయిదా వేశారు. 1/70 చట్టానికి రక్షణ కల్పించడంతో పాటు షెడ్యూల్‌ ప్రాంతంలో నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలనీ, ఆదివాసి స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించాలని,పాడేరు మెడికల్‌ కాలేజీలో పోస్టులన్ని స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలని, మన్యంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన పవర్‌ ప్రాజెక్టులు ఆలోచన తక్షణమే విరమించుకోవాలని కూడా గిరిజన సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు కోరుతున్నారు. బంద్‌కు సీపీఐ, సీపీఎం, వైసీపీ ఇతర ప్రజా సంఘాలు, గిరిజన, విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమాల్లో భాగమయ్యారు.
పాడేరులో…
తెల్లవారు జామునుంచే పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్దకు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు, ఆదివాసీ అఖిల పక్ష ప్రజా సంఘాల వేదిక ప్రతినిధులు చేరుకుని పాడేరు డిపో నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా నిరోధించారు. పట్టణంలో అన్ని షాపులు, హోటళ్ళు, టీ దుకాణాల సైతం స్వచ్ఛందంగా మూసివేసి బందుకు మద్దతు పలికారు. రవాణా పూర్తిగా స్తంభించింది. బంద్‌ విజయవంతానికి పాడేరు ఎమ్మెల్యేతో పాటు ఆదివాసీ అఖిల పక్ష ప్రజా సంఘాల వేదిక ప్రతినిధులు, సీపీఐ జిల్లా కార్యదర్శి పోట్టిక సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకులు అమర్‌, గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్మ, డీఎల్‌ఎ కేంద్ర కమిటీ సభ్యులు సమర్ది మాణిక్యం, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధా కృష్ణ, ఆదివాసీ సేన నాయకుడు చుంచు రాజబాబు, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ప్రతినిధి వంతాల నాగేశ్వర రావు,డీఎల్‌ఓ ప్రతినిధి కొండపల్లి కాంతారావు, ఎస్‌ఎఫ్‌ఐ జీవన్‌ కృష్ణ, వైసీపీ నాయకులు తెడ బరికి సురేష్‌ కుమార్‌, కూడా సుబ్రమణ్యం, పొంగి నాగరాజు, శరభ సూర్యనారాయణ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
బోసిపోయిన అరకు
అరకులోయలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. షాపులు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బొర్రా గుహలు, తడిగూడ జలపాతం, వ్యూ పాయింట్‌, ఊడెన్‌ బ్రీజ్‌, గిరిజన సాంస్కృతిక మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, చాపరైజల ప్రాంతంతో పాటు వివిధ పర్యాటక ప్రాంతాలు సందర్శకులు లేక వెలవెలబోయాయి. బంద్‌ రెండు రోజులు ఉండడంతో అరకులోయ ప్రాంతం కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, ఆదివాసి గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి పొద్దు బలదేవ్‌, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, వైసిపి నాయకుడు కమిడి అశోక్‌, వివిధ సంఘాల నాయకులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు