కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగం లేకపోతే కుటుంబం గడవడం కష్టమనుకునే వాళ్లకే కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని వ్యాఖ్యానించింది. అవసరాలకు కనీస డబ్బు కూడా లేని వాళ్లకే ఈ ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపింది. అంతేకానీ… మరణించిన ఉద్యోగి కుటుంబ జీవన ప్రమాణాలు తగ్గిపోతాయనే కారణంతో ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. మరణించిన ఉద్యోగి సంపాదనతోనే కుటుంబం నడుస్తున్న పరిస్థితుల్లోనే కుటుంబ సభ్యుల్లోని అర్హులకు ఉద్యోగం ఇవ్వాలన్నది కారుణ్య నియామక ఉద్దేశమని తెలిపింది. ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈమేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం అభిప్రాయపడింది. వివరాల్లోకి వెళితే… కెనరా బ్యాంక్ లో పని చేస్తున్న ఒక ఉద్యోగి పదవీ విరమణ కంటే ముందు 2001లో మరణించారు. కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ ఆయన కుమారుడు అజిత్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే బ్యాంకు ఉన్నతాధికారి దాన్ని తిరస్కరించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు 2 నెలల్లోగా ఉద్యోగం ఇవ్వాలని, రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంకు అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది.