భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ట్రేడ్, సుంకాలు, ఇమిగ్రేషన్, ఇరుదేశాల మధ్య సంబంధాలు తదితర అంశాలపై వారిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మోదీ వెంట భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభల్ కూడా ఉన్నారు. ఇక ఈ కీలక భేటీ అనంతరం ఇరువురు దేశాధినేతలు విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ…శ్వేతసౌధంలో మళ్లీ ట్రంప్ ను చూడటం ఆనందంగా ఉంది. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఆయనకు శుభాకాంక్షలు. మరో నాలుగేళ్లు ట్రంప్ తో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉంది. అగ్రరాజ్యం ప్రయోజనాలే ప్రధానంగా ట్రంప్ కృషి చేస్తారు. ఆయనలాగే నేను భారత్ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టం. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాంఁ అని మోదీ అన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ… ఁభారత్‌కు నరేంద్ర మోదీ లాంటి నేత ఉండటం గర్వకారణం. మోదీ నాకు చాలా ఏళ్లుగా మిత్రుడు. మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తాం. మా ఇద్దరి మధ్య గొప్ప ఐక్యత ఉంది. దేశాలుగా భారత్, యూఎస్ కలిసి ఉండటం చాలా ముఖ్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మాకు ఆయిల్, గ్యాస్ లాంటి చమురు వనరులు అందుబాటులో ఉన్నాయి. అవి ఇండియాకు కావాలి. మేం మంచి చేయాలని చూస్తున్నాం. ఎవర్నీ ఓడించాలనుకోవట్లేదు. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పని చేస్తాం. భారత్ తో స్నేహాన్ని ఇలాగే కొనసాగిస్తాం. అందులో ఎటువంటి మార్పు ఉండదుఁ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.