ఇటీవల మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) నెమ్మదిగా దక్షిణాదికి వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జీజీహెచ్లో వెలుగులోకి వచ్చాయి. జీబీఎస్ వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు బాధితులకు గుంటూరులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పర్యటనలో ఉన్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు గుంటూరు జిజిహెచ్ను శుక్రవారం ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కృష్ణబాబు సందర్శించారు. గుంటూరు జీజీహెచ్లో గులియన్ బాలీ సిండ్రోం (జీబీఎస్) కేసులతో పాటు రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితిని మంత్రికి కృష్ణబాబు వివరించారు. రాష్ట్రంలోని పలు జీజీహెచ్లలో ఇప్పటి వరకు 17 మంది జీబీఎస్ బాధితులు చికిత్స పొందుతున్నారని కృష్ణబాబు తెలిపారు. అన్ని జీజీహెచ్లలో ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. అదనంగా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు అవసరమైతే వెంటనే కొనుగోలు చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబును ఆదేశించారు. జీబీఎస్ బాధితులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు. జీజీహెచ్లలో పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. గుంటూరు జీజీహెచ్లో ఐదుగురు జీబీఎస్ పేషెంట్లు చికిత్స పొందుతుండగా, రెండు రోజుల క్రితం ఇద్దరు డిచ్చార్జ్ అయ్యారని మంత్రికి కృష్ణబాబు వివరించారు. కోనసీమ, గుంటూరు జిల్లాలు, గిద్దలూరు, నరసారావుపేట ప్రాంతాల నుండి గుంటూరు జీజీహెచ్లో జీబీఎస్ బాధితులు చేరి చికిత్స పొందుతున్నారు. ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు తీసుకోకుండానే 80 శాతం మంది జీబీఎస్ బాధితులు రికవర్ అయ్యారని కృష్ణబాబు పేర్కొన్నారు. 10 నుంచి 15 శాతం జీబీఎస్ బాధితులకు మాత్రమే చికిత్స అవసరమయిందని, ఐసీయూల్లో చికిత్స అందిస్తూ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు ఇచ్చారని తెలిపారు.