ఇంటర్ మెమోలలో తప్పుగా ప్రింట్ అయిన ఫొటోలు
పలు ఇంజినీరింగ్ కాలేజీలలో చేరిన బాధిత విద్యార్థులు..ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత విద్యార్థులు
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో 60 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా ఇంటర్ మార్క్స్ మెమోలలో ఫొటోలు తప్పుగా వచ్చాయి. దీంతో కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధిత విద్యార్థులంతా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కాలేజీ, కోడేరు బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కాలేజీకి చెందినవారు. వీరు 2024లో ఇంటర్ పాస్ అయ్యారు.
మరోవైపు, ఫొటోలు తప్పుగా ప్రింట్ కావడంపై డీఈవో వెంకటరమణ మాట్లాడుతూ… ఇందులో తమవైపు నుంచి ఎలాంటి తప్పిదం లేదని… తప్పును ఇంటర్ బోర్డు సరిచేయాల్సి ఉందని చెప్పారు. ఈ విద్యార్థులంతా వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరినప్పటికీ… మెమోలు సరిగా లేకపోవడంతో కాలేజీలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే స్పందించి మెమోలను సరిచేయాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు.