వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా బెంగళూరు వాటర్ బోర్డ్ ముందస్తు చర్యలు చేపట్టింది. గతేడాది ఎదుర్కొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈసారి పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఎండాకాలం మొదలు కానున్న నేపథ్యంలో నీటి పొదుపు చర్యలకు దిగింది. నగరపాలక సంస్థ సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని తాజాగా పేర్కొంది. పదే పదే ఇలా చేసే వారికి అదనపు వడ్డింపులు కూడా ఉంటాయని హెచ్చరించింది. నగరంలో భూగర్భ జనాలు వేగంగా పడిపోతున్నాయని వెల్లడించింది. రాబోయే రోజుల్లో నగరంలో నీటి కొరత ఏర్పడుతుందని ఐఐఎస్‌సీ సంస్థ శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. వాహనాలు కడగడం, తోటల్లో మొక్కలకు నీళ్లు, నిర్మాణావసరాలు, డెరకేటివ్ ఫౌంటెయిన్‌లు, సినిమా హాళ్లు మాల్స్, రోడ్లు నిర్మాణం, ఇతర అవసరాలకు తాగునీటిని వినియోగించడంపై బెంగళూరు నగరంలో నిషేధం విధిస్తున్నాము. ఈ నిబంధనను అతిక్రమించిన వారికి వాటర్ బోర్డు యాక్ట్‌లోని సెక్షన్ 109 ప్రకారం రూ.5 వేల జరిమానా విధిస్తాము. పదే పదే ఈ ఉల్లంఘనకు పాల్పడే వారిపై రూ.5 వేల జరిమానాతో పాటు అదనంగా మరో రూ500 ఫైన్ విధిస్తాము అని ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై తమకు నేరుగా ఫిర్యాదు చేయాలని కూడా పేర్కొంది. ఇక బెంగళూరులో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలకు చేరింది.