Sunday, February 23, 2025
Homeవిశ్లేషణపాప ప్రక్షాళన

పాప ప్రక్షాళన

చింతపట్ల సుదర్శన్‌

నిన్ను చూస్తుంటే భూమి గుండ్రంగా ఉందనే మాట కరెక్టు అనిపిస్తున్నది అంది డాంకీ అరుగుమీద ఓమూల దిగులుగా కూర్చుని ఉన్న డాగీతో. డాగీ ఇటు తిరిగి కూడా చూడలేదు. ఏంటా చిరాకూ పరాకూ ప్రతిపక్షం వాళ్లు సభలో అరిచి మొత్తుకుంటుంటే ఏమీ పట్టనట్టు ఉండే అధికార పక్షం నాయకుడిలాగు అంది డాంకీ.
అప్పుడు ముఖం కాస్త ఇటు టర్నిచ్చుకుంది డాగీ. ముఖంలో మాత్రం దిగులు గూడు కట్టుకుని ఉంది. పోయినవారం నేను పెట్టిన దిగులు ఫేస్‌నే నువ్విప్పుడు కంటిన్యూ చేస్తున్నావు. భూమి ఈ పక్క నించి ఆ పక్కకు తిరిగినట్టుంది అందుకే అది క్రికెట్‌ బంతిలా ఉండి దొర్లిందని నా అభిప్రాయం ఇంతకీ ఆ ముఖంలో తిష్ట వేసిన దిగులుకూ విచారానికీ కారణం ఏమిటి చెప్మా అంది డాంకీ.
డాగీ ముఖం ఆకాశం వైపు ఎత్తి కావలిసినంత చీకూ చింతని పైకెగరేసింది. అర్థమైందోయి నీ ఈ శోక భంగిమ దేనికో. కోళ్లు నమలడానికి లేదనేగా. మాయదారి బర్డ్‌ఫ్లూ వల్ల చికెన్‌ లెగ్‌ పీసులు కరువై జనం ఏడ్పు లంకించుకుంటున్నారు. నీదీ ఆ ఏడుపేనా అంది డాంకీ.
నా ముఖానికి నాన్‌వెజ్జూ దాంట్లో లెగ్‌పీసూ ఏది దొరికితే అది తిని కడుపు నింపుకునే వీధి కుక్కని నేను. లక్షల కొద్దీ కోళ్లు చస్తున్నాయని మనుషులు దిగులూ, బెంగా, బాధా, దుఃఖం పడాలి గాని నాకెందుకు మాంసంలేని ఎముకలు దొరికితే భాగ్యం బంగారం అనుకునేవాడ్ని. అయినా ఇప్పుడు నా బాధ మెస్మరైజ్‌ చేసే బడ్జెట్‌ గురించి, ఇన్‌కంటాక్సు తాయిలాల గురించీ కానేకాదు. తిండి సంగతి అస్సలు కాదు. వేరే ఉందిలే అంటూ గాల్లోకి ముక్కు ఎగరేసి నిట్టూర్చింది డాగీ. అవునా! అలాగా! అదెలాగ! చెప్పుచెప్పు మనసు విప్పు అంది డాంకీ.
ఏం చెప్పను. ఎంత పాపం చేసుకుంటే అదే పోయిన జన్మలో, ఈ జన్మలో ఇలాగ నాలుగు కాళ్ల పశువునై పుట్టాను. ఇప్పుడైనా ఏది పాపమో ఏది పుణ్యమో తెల్సుకునే బుద్ధీ జ్ఞానం రెండూనూ ఎన్నడూ వినని మాటలు ప్రయోగిస్తున్నావే. అవును నాకే కాదు నీకూ మనలాంటి పశువులకూ కూడా అర్జంటుగా అవసరం ఈ బుద్ధీ జ్ఞానమూ. ఇన్నాళ్లూ ఈ రెండూ లేకపోయే అని విచార పడుతున్నాను అంది డాగీ. ఓహో అదా రీజను. ఈ మాడ్పు మొగం బుద్ధీజ్ఞానం కోసమా?
అవును. ఇంత సీరియస్‌ మ్యాటర్‌ వదిలేసి చికెనూ లెగ్గూ అంటావు తిండానికే జన్మ ఎత్తినట్టు మనుషుల్లాగా. అయినా ఇప్పుడు వాళ్లకూ బోలెడు బుద్ధీజ్ఞానమూ పుట్టు కొచ్చినట్టున్నది.
ఈ మాటెవరన్నారు నీతో అంది డాంకీ. ఎవరు అనేదేముంది చూస్తే కనిపించడం లేదూ కార్లూ, బస్సులూ, రైళ్లూ, విమానాలూ అన్నీ పరిగెతుతున్నాయి. బుద్ధీ జ్ఞానం వచ్చిన వాళ్లని మోసుకువెళ్లి గంగలో ముంచి తెస్తున్నాయి. ఆగాగు. నువ్వన్న మాటలిప్పుడిప్పుడే మెదడులో న్యూరాన్సుకు అందుతున్నవి. నువ్వంటున్నది కుంభమేళా గురించేనా? అక్కడ నీట్లో మునక గురించేనా? అవును గురూజీ స్వామీజీ, సాధూజీ ‘ఆల్‌ రోడ్స్‌ లీడ్‌ టు మేళా కుంభమేళా’ అన్న మాట.
ఇప్పుడు మొత్తం దిగింది బాకులా గుండెలోకి. అవును లక్షల్లో సాధువులు, కోట్లల్లో పాపులు కుప్పతెప్పలుగా వెళ్తున్నారు. గంగలో దూకడానికి అదే మునగడానికి. బూడిద తొడుక్కున్న సాధువులు, తల మీద కిలోల లెక్కన రుద్రాక్షల మూటలు మోస్తున్న స్వాములు, మెడ నిండా పాములు వేసుకున్న స్వాములు, తన్నే స్వాములు, తిట్టే బైరాగులు, ఎత్తిన చేయి ఎత్తి పట్టుకునే ఉండే స్వామి ఒకరైతే, పాతికేళ్ల నుంచి స్నానం ఎరుగని స్వామి ఒకరు ఒకరా ఇద్దరా పుణ్య పురుషులు అంది డాంకీ. అంతా అక్కడికెళ్లి ఎందుకు మునుగుతున్నారు చేసిన పాపాలు పోతాయనే కదా. అధికారులు, పరిపాలకులు, సామాన్యులు ఒకరేమిటి ఎందరెందరో పాపాల్ని నది నీళ్లల్లో డిపాజిట్టు చేస్తున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాటలో సంఖ్య కరెక్టుగా బయటకు రానివాళ్లు, రైలు స్టేషన్లో, రోడ్డు మీద ప్రమాదాలలో సరాసరి స్వర్గానికే పోయారట కదా అంది డాగీ.
జనం బుడుంగున మునిగి నీట్లో వదిలేసిన పాపాల్ని సూర్యుడు పైకిలాగి మేఘాల రూపంలో మళ్లీ ఆ నదిలోనే వదిలేస్తాడుగా వర్షంగా అంటూ నవ్వుతూ అరుగు ఎక్కాడు అబ్బాయి.
రా ‘బ్రో’ రా. కుంభమేళా స్నానం అయ్యిందా. పాపాలన్నీ ప్రక్షాళనం అయినట్టేనా. నిన్ను ముట్టుకుంటే నా పాపాలు పోయి మళ్లీ మనిషిగా జన్మ ఎత్తుతానా అంది ఆశగా డాగీ.
నీళ్లల్లో మునిగి పాపాలు పోయినవని దులిపేసుకుని మళ్లీ పాపాలు చేస్తారు మనుషులు. నీట్లో మునిగితే పాపాలు శుభ్రమై పోవడం భ్రమ అంది డాగీ.
నువ్వేమన్నా చెప్పు. నాకు ఒక్కసారి వెళ్లి ఆ నీట్లో స్నానం చేసి వస్తే వచ్చే జన్మలో మనిషినై, మంత్రినై పోతాననే ఆశ కల్గుతున్నది. అది తీరదనే దుఃఖమే నా ముఖాన వేలాడ్తున్నది. బుద్ధీజ్ఞానమూ వచ్చి లాభమేంటి అని కళ్లు మూసుకుంది డాగీ.
అక్కడి దాకా వెళ్లడానికి డబ్బులేక ఇంట్లో బాత్‌రూమ్‌ కుళాయి నీళ్లల్లో పాపాల్ని ప్రక్షాళనం చేసుకుంటున్నానన్నాడు అబ్బాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు