Sunday, February 23, 2025
Homeఅంతర్జాతీయంఆ ఐదు జోన్లలో ఐడీఎఫ్‌ కొనసాగింపు

ఆ ఐదు జోన్లలో ఐడీఎఫ్‌ కొనసాగింపు

లెబనాన్‌ నుంచి సైనిక ఉపసంహరణపై ఇజ్రాయిల్‌

బీరుట్‌/టెల్‌ అవీవ్‌: దక్షిణ లెబనాన్‌ నుంచి ఇజ్రాయిల్‌ బలగాల ఉపసంహరణకు విధించిన గడువు మంగళవారంతో ముగిసింది. ఐదు వ్యూహాత్మక క్షేత్రాల్లో తమ సైన్యాన్ని మోహరించి ఉంచుతామని ఇజ్రాయిల్‌ వెల్లడిరచింది. లెబనాన్‌లోని ఐదు బఫర్‌ జోన్లలో ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) ఉంటాయని ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయిల్‌ కట్జ్‌ వెల్లడిరచారు. ఉపసంహరణ గడువు ముగిసినప్పటికీ ఆ ఐదు ప్రాంతాల నుంచి దళాలను వెనక్కి పంపేది లేదని స్పష్టంచేశారు. హెజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఈ మేరకు అంగీకారం కుదిరింది. నవంబరు 27న అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. వాస్తవానికి సోమవారం నుంచి ఇజ్రాయిల్‌ దళాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. కొన్ని సరిహద్దు గ్రామాల నుంచి బలగాలు వెనక్కి వెళుతున్నట్లు లెబనాన్‌ భద్రతాధికారి తొలుత చెప్పారు. కానీ ఐదు కంట్రోల్‌ పోస్టుల వద్ద లెబనాన్‌ బఫర్‌ జోన్లలో ఐడీఎఫ్‌ రక్షణ కొనసాగుతుందని, ఇజ్రాయిల్‌ గ్రామాలకు, లెబనాన్‌ నుంచి బెదిరింపులు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్ల సైనిక ఉపసంహరణకు గడువు ముగిసిన కొన్ని గంటల్లోనే కీలక ప్రకటన చేశారు. సరిహద్దు వద్ద ఇజ్రాయిల్‌ వైపు కొత్త అవుట్‌పోస్టులను తమ సైన్యం ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడిరచారు. లిటానీ నది ఆపై ప్రాంతాల నుంచి హెజ్బుల్లా పూర్తిస్థాయిలో వెనక్కి తగ్గాలన్నారు. ఆ సాయుధ దళాన్ని పూర్తిగా నిరాయుధీకరించాలని లెబనాన్‌ సైన్యంపై కట్జ్‌ ఒత్తిడి తెచ్చారు. హెజ్బుల తరపున ఎలాంటి అతిక్రమణలు జరిగినా దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. అన్ని ఉత్తరాది ప్రాంతాలను రక్షిస్తామన్నారు. కాగా, హెజ్బుల్లాకు పట్టున్న తూర్పు`దక్షిణ లెబనాన్‌, దక్షిణ బీరుట్‌లో గత రెండు నెలలుగా సాగిన యుద్ధం కారణంగా జరిగిన నష్టం భారీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పున:నిర్మాణానికి 10 బిలియన్‌ డాలర్లకుపై ఖర్చు కావచ్చన్న అంచనాకు వచ్చారు. లక్ష మందికిపైగా నిరాశ్రయులు అయినట్లు ఐరాస గణాంకాలు చెబుతున్నాయి.
దురాక్రమణగానే భావిస్తాం: లెబనాన్‌
సైనిక ఉపసంహరణ పూర్తి స్థాయిలో జరగబోదని ఇజ్రాయిల్‌ ప్రకటించడాన్ని లెబనాన్‌ ఆక్షేపించింది. తమ భూభాగంలో ఇజ్రాయిల్‌ దళాలు ఉండటాన్ని దురాక్రమణగానే భావిస్తామని ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అధికారం తమకున్నట్లు వెల్లడిరచింది. ఇజ్రాయిల్‌ సైన్యం పూర్తిస్థాయిలో తమ భూభాగం నుంచి వెళ్లిపోయేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునే హక్కు లెబనాన్‌కు ఉన్నదని లెబనాన్‌ అధ్యక్షుడి తరపున ఓ అధికారి ప్రకటించారు.
హమాస్‌ సైన్యాధికారి హతం
లెబనాన్‌లో జరిపిన వైమానిక దాడిలో హమాస్‌ సైన్యాధికారి హతమైనట్లు ఇజ్రాయిల్‌ భద్రతాధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయిల్‌ సైన్యం, షిన్‌ బెట్‌ ప్రాదేశిక భద్రతా సంస్థ సంయుక్త ప్రకటన చేశాయి. దక్షిణ లెబనాన్‌ కోస్తా నగరమైన సిడాన్‌లో జరిపిన వైమానిక దాడుల్లో మహమ్మద్‌ షహీన్‌ మరణించారు. ఆయన లెబనాన్‌ ఆపరేషన్స్‌ విభాగంలో హమాస్‌ అధిపతి, ఇటీవల లెబనాన్‌ నుంచి ఇజ్రాయిల్‌ సౌరులపై జరిగిన దాడుల సూత్రధారి అంటూ సంయుక్త ప్రకటన పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు