Saturday, February 22, 2025
Homeఅందని ఊపిరి

అందని ఊపిరి

500 కోట్ల మంది రోగులకు కష్టాలు

. పేద దేశాల్లో పరిస్థితి దయనీయం
. ఆసియా`ఆఫ్రికాలో ప్రాణవాయువు అవసరం అధికం
. మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యతపై లాన్సెట్‌ నివేదిక

న్యూదిల్లీ : ప్రపంచ జనాభాలో మూడిరట రెండు వంతులు అంటే దాదాపు 500 కోట్ల మందికి మెడికల్‌ ఆక్సిజన్‌ (ప్రాణ వాయువు) అందడం లేదు. దీర్ఘకాల రోగ బాధితులకు శస్త్రచికిత్స సమయంలో మెడికల్‌ అక్సిజన్‌ అవసరం ఉంటుంది. కోవిడ్‌19 తరహా మహమ్మారుల వేళ దీనికి డిమాండ్‌ మరింత అధికం. భారత్‌లో కోవిడ్‌ విజృంభణ వేళ మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత అనేక మంది ప్రాణాలను హరించిన విషయం తెలిసిందే. మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత ప్రభావం పేద దేశాల రోగులపైనే అధికంగా ఉన్నట్లు లాన్సెట్‌ అధ్యయనం తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరమైన రోగుల్లో 82 శాతం మంది పేదమధ్య ఆదాయ దేశాలు (ఎల్‌ఎంఐసీలు)లో ఉండగా… దక్షిణతూర్పు ఆసియాతో పాటు పసిఫిక్‌, సబ్‌ సహారన్‌ ఆఫ్రికాలో 70 శాతం మంది ఉన్నట్లు తెలిపింది. క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీఓపీడీ) రోగులకు ఆక్సిజన్‌ అవసరం దీర్ఘకాలం ఉంటుందని నివేదిక పేర్కొంది. పేదమధ్య ఆదాయ దేశాలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని తెలిపింది. ప్రపంచ జనాభాకు మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యతపై లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ కమిషన్‌ అధ్యయనం జరిపింది. పేద, మధ్యస్థాయి ఆదాయ దేశాల మధ్య అసమానతలు… సరఫరాలో తేడాలు… డిమాండ్‌లభ్యతతో పాటు ఖర్చుల్లో వ్యత్యాసాలు గుర్తించినట్లు నివేదిక తెలిపింది. శస్త్రచికిత్సలతో పాటు ఆస్తమా, ట్రామా రోగులకు, మాతృశిశు సంరక్షణకు మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరం ఎక్కువ. కాగా మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యతపై మెల్బోర్న్‌ యూనివర్సిటీ సహా పరిశోధకుల అంతర్జా తీయ బృందం కొన్ని సిఫార్సులు చేసింది. ప్రాణవాయువు బ్లాక్‌ మార్కెటింగ్‌ పెరగడంతో సమస్య మరింత జఠిలమైంది. కోవిడ్‌19 రాక ముందు మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ తీర్చేందుకు థర్డ్‌ పార్టీ విక్రేతలపైనే ఆసుపత్రులు ఎక్కువగా ఆధారపడ్డాయి. మహమ్మారి విజృంభణతో డిమాండ్‌ పెరిగి బ్లాక్‌మార్కెటింగ్‌ జరిగింది. పరిమితికి మించి నిల్వలు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా మెడికల్‌ ఆక్సిజన్‌ కోసం వినతులు విపరీతంగా వచ్చాయి. కొన్ని అసాధారణ సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకున్నాయి. ఆక్సిజన్‌ సరఫరా కోసం సంబంధిత సంస్థలకు, ప్రభుత్వానికి ఆదేశాలిచ్చాయి. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే సముచిత రీతిలో మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా ఉండాలని అధ్యయనకర్తలు సూచించారు. ప్రభుత్వాలకు, పరిశ్రమలకు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు, విద్యాసంస్థలకు, పౌర సమాజానికి కొన్ని సిఫార్సులు చేశారు. మెడికల్‌ ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుకునేలా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని, ఇందుకోసం ఐక్య కృషి అవశ్యమని సూచించారు. అంతర్జాతీయ ప్రజారోగ్య సంరక్షణకు దోహదపడేలా మెడికల్‌ ఆక్సిజన్‌ వనరులు ఉండాలన్నారు. అయితే మెడికల్‌ ఆక్సిజన్‌తో వైద్యం వ్యయంతో కూడుకున్నదని గుర్తుచేశారు. 2030 నాటికి ఆరోగ్యపరంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ప్రపంచం పురోగమించడంలో మెడికల్‌ ఆక్సిజన్‌ పాత్ర ప్రధానమన్నారు. తదుపరి మహమ్మారికి ప్రపంచ దేశాలు సంసిద్ధంగా ఉండటం కోసం సముచిత చర్యలు అవసరమని, మెడికల్‌ ఆక్సిజన్‌పై దృష్టి సారించకుంటే భవిష్యత్‌లో ఆరోగ్య సంరక్షణ లక్ష్యాల సాధనకు తక్షణ చర్యలు అత్యవసరమని అధ్యయనకర్తలు సూచించారు. మెడికల్‌ ఆక్సిజన్‌పై పెట్టుబడి ప్రపంచ ప్రజారోగ్య మెరుగుదలకు సరళమైన, సమర్థమైన మార్గాల్లో ఒకటి కాగలదని అధ్యయనం వెల్లడిరచింది. తద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పురోగతి సాధ్యమని పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ సవాళ్లను పరిష్కరించడంతో పాటు సంబంధిత వ్యత్యాసాలను తగ్గించడానికి సమష్టిగా కృషి చేయడం ముఖ్యమని నివేదిక నొక్కిచెప్పింది. గతంలో పోలిస్తే మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి, పంపిణీలో భారత్‌ పురోగతి సాధించినట్లు తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు