విశాలాంధ్ర బ్యూరో, మేడ్చల్‌మల్కాజిగిరి : ఈ ఆర్థిక సంవత్సర ముగింపులోగా విద్యా, గృహారుణాల లక్ష్యాలను పూర్తి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు, డిసిసి ఛైర్మన్ విజయేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్
మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిసిసి, డిఎల్‌ఆర్సి సమావేశానికి అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మూడవ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ సంక్షేమ శాఖల ద్వారా ఆర్థిక సంవత్సర ముగింపులోగా విద్యా, గృహారుణాల లక్ష్యాలను పూర్తి చేయాలని బ్యాంకర్లను సూచించారు. వార్షిక రుణ ప్రణాళిక (ఏసిపి) కింద బ్యాంకుల పని తీరు, ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఎజెండా అంశాలు మొదలైనవాటిని సమీక్షించారు. రాబోవు 2025-26 సంవత్సరానికి నాబార్డ్ ద్వారా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ కరదీపికను జిల్లా అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి ఆవిష్కరించారు. నాబార్డ్ ప్రతి జిల్లాకు ప్రతి సంవత్సరం పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పిఎల్‌పి)ని సిద్ధం చేస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని, జిల్లాలోని లీడ్ బ్యాంక్ జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా అమలు చేయడానికి వార్షిక జిల్లా క్రెడిట్ ప్లాన్‌ని సిద్ధం చేస్తుంది. దీని ప్రకారం మేడ్చల్‌కు సంబం ధించిన 2025-26 పిఎల్‌పిని బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం రూ.469.66 కోట్లు, వ్యవసా యం, అనుబంధ కార్యకలాపాల కోసం టర్మ్ లోన్ రూ.893.53 కోట్లు, వ్యవసా యం మౌలిక సదుపాయాలు కోసం రూ. 246.31 కోట్లు, అనుబంధ కార్యకలాపాలు కోసం రూ. 1383.58 కోట్లు సూక్ష్మ చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) కోసం రూ.23042.33 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగ రుణాలు రంగాలు విద్య హౌసింగ్ సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రెన్యూవబుల్ ఎనర్జీ మొదలైనవి కోసం రూ.2121.73 కోట్లు సహా జిల్లా మొత్తం ప్రాధాన్యతా రంగానికి రూ.28157.15 కోట్లుగా నాబార్డ్ ఆర్థిక అంచనా వేసింది. అదనపు కలెక్టర్‌తో పాటు అఖిల్ పున్నా డిడిఎం నాబార్డ్, శివ ప్రసాద్ ఎల్డిఎం, ఆర్బిఐ ఎజిఎం లక్ష్మీ శ్రావ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, బ్యాంక్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అన్ని బ్యాంకులు చురుకుగా రుణాలిచ్చి 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని డిసిసి ఛైర్మన్ సూచించారు.