విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయీస్ హమాలీ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) హమాలీ కార్మికులకు పెంచిన హమాలీ రేట్ల జి.ఓ.ను విడుదల చేయాలని 7 రోజులు నిరవధిక సమ్మె చేస్తే ప్రభుత్వం దిగివచ్చి హమాలీ రేట్లు పెంచుతూ జి.ఓ. విడుదల చేయటాన్ని నేడు ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సివిల్ సప్లయీస్ హమాలీ యూనియన్ పోరాట విజయోత్సవ సభకు సివిల్ సప్లయీస్ హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మునీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ఓమయ్యలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎఐటియుసి సీనియర్ నాయకులు వి.యస్.బోస్, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్రాజ్లు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను సవరించి కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా బిజెపి ప్రభుత్వం అవలంభించటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలో కార్మికవర్గం పోరాటాలు, ఉద్యమాల ద్వారా అనేక దేశాలలో పెట్టుబడిదారుల, కార్పొరేట్ శక్తుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చేసి వాటి స్థానంలో కార్మిక రాజ్యాలను స్థాపించుకున్న చరిత్ర ప్రపంచ కార్మికవర్గానిదని వారు తెలిపారు. సివిల్ సప్లయీస్ హమాలీ కార్మికులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచేందుకు అంగీకరించినా గత ప్రభుత్వాలు వాటిని తుంగలో తొక్కి నేటి ప్రభుత్వం ఒక సంవత్సరం దాటినా హమాలీ రేట్లు పెంపుదల చేయకుండా దాటవేయటాన్ని కార్మికులు 7 రోజుల సమ్మె ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. అన్ని మండల పాయింట్లలలో సొంత గోడ్కెన్లు నిర్మించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని వారు కోరారు. చట్ట ప్రకారం 14 రోజుల ముందు సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె చేసే ఆ సమ్మెను అనిచివేసే ప్రయత్నం చేయటం కూడా నేరమే అవుతుదని వారు తెలిపారు. ప్రభుత్వం హమాలీ కార్మికులను చిన్నచూపు చూస్తూ శ్రమదోపిడికీ గురిచేస్తున్నారని వారికి సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి యం.డి.ఇమ్రాన్, కామారెడ్డి జిల్లా సివిల్ సప్లయీస్ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బాల్రాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గోర నర్సింహ్మా, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి దేవేందర్, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రమణయ్య, అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అప్రోజ్, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ములుగు జిల్లా కోశాధికారి రమేష్, నిర్మల్ జిల్లా కార్యదర్శి పుండరి, నల్గొండ జిల్లా అధ్యక్షులు వెంకన్న, మహబూబాబాద్ జిల్లా జకరయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. పోర్టిఫైడ్ రైస్ ఎగుమతి, దిగుమతికి భూపాలపల్లిలో నాలుగున్నర లక్షల రూపాయలు చెల్లించకుండా ఒక సంవత్సరంన్నర కాలం నుండి కార్మికులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో పోర్టిఫైడ్ రైస్ ఎగుమతి, దిగుమతి హమాలీ రేట్లను వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.