Saturday, February 22, 2025
Homeఏపీకి నీటి పంపిణీ ఆపాలి

ఏపీకి నీటి పంపిణీ ఆపాలి

. ఇప్పటికే వాటాకు మించి వాడేశారు
. శ్రీశైలం, సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయవద్దు
. కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
. బోర్డు సమావేశం 24కు వాయిదా

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి నీరు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరుతూ కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మరోమారు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఏపీ వాటాకు మించి నీటిని వాడుకున్నారని ఆరోపించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులపై చర్చించేందుకు శుక్రవారం రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో నిర్వహించాల్సిన కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్సీ అనిల్‌ కుమార్‌, నాగార్జున సాగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ అజయ్‌ కుమార్‌లు శుక్రవారం జలసౌధలో కేఆర్‌ఎంబీ చైర్మన్‌ అతుల్‌ జైన్‌ను కలిసి, తక్షణమే ఏపీకి నీటి పంపిణీ ఆపాలని కోరారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాహుల్‌ బొజ్జా.. బోర్డుకు లేఖ అందించారు. ఏపీ ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడుకుందని, ఇక నుంచి ఉమ్మడి జలాశయాల నుంచి ఏపీ నీటిని తీసుకోరాదని తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నుంచి ఇకపై నీటిని తీసుకోకుండా నిలువరించాలన్నారు. మే నెల వరకు తెలంగాణకు 107 టీఎంసీల నీరు ఇవ్వాలని బోర్డుకు ఇండెంట్‌ ఇచ్చారు. ఇవాళ జరగాల్సిన ప్రత్యేక సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరినందున, ఆ రోజు సమావేశంలో చర్చించే వరకు శ్రీశైలం, సాగర్‌ నుంచి ఏపీ నీటిని తీసుకోకుండా చూడాలని తెలంగాణ అధికారులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ బోర్డు తగిన విధంగా స్పందించడం లేదని, కేంద్ర మంత్రి నుంచి ఆదేశాలు వచ్చినా అమలు చేయడం లేదని తెలంగాణ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కేఆర్‌ఎంబీ సమావేశం 24వ తేదీకి వాయిదా
కృష్ణానదీ యాజమాన్య బోర్డు అత్యవసరంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం ఈ నెల 24వ తేదీకి వాయిదా పడిరది. ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల ముఖ్య కార్యదర్శితో కృష్ణాబోర్డు చైైర్మన్‌ అతుల్‌ జైన్‌ మధ్యాహ్నం సమావేశం కావాల్సి ఉంది.అయితే తనకు ముందుగానే నిర్ణయించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున నేడు హాజరు కాలేకపోతున్నానని, సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఏపీ స్పెషల్‌ సీఎస్‌ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రత్యేక సమావేశాన్ని కేఆర్‌ఎంబీ సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాద్‌ జలసౌధలో సమావేశం జరగనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులకు కేఆర్‌ఎంబీ సమాచారం పంపించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు