Tuesday, February 25, 2025
Homeవిశ్లేషణఅరసం మొదటి మహాసభ

అరసం మొదటి మహాసభ

ఆర్వీ రామారావ్‌

అంతర్జాతీయంగా విపత్కర సమస్యలున్న నేపథ్యం లోనే లక్నోలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభ సందర్భంగా 1936 ఏప్రిల్‌ 9-19 తేదీల్లో అభ్యుదయ రచయితల సంఘం (అ.ర.సం.) మొదటి మహాసభ జరిగింది. 1935లో లండన్‌ లో ఏర్పడ్డ భారత అభ్యుదయ రచయితల సంఘం కొనసాగింపుగానే లక్నోలో అ.ర.సం. ఏర్పడిరది. దీనికి మున్షీ ప్రేమ్‌చంద్‌ అధ్యక్షత వహించారు. 1936లో జాతీయోద్యమంలో పెద్ద మార్పు వచ్చింది. అప్పుడు లక్నోలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో నెహ్రూ అధ్యక్షోపన్యాసం ఈ మార్పును ప్రతిబింబించింది. సోవియట్‌ యూనియన్‌లో ఏర్పడిన సోషలిస్టు సమాజాన్ని నెహ్రూ కీర్తించారు. జాతీయోద్యమంలోని అనుభవాలే ఈ మార్పుకు కారణమయ్యాయి. ఈ మార్పుల ఫలితంగానే అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భవించింది. ప్రసిద్ధ ఉర్దూ రచయితలు ఫిరాఖ్‌ గోరఖ్‌ పూరి, ఫైజ్‌ అహమద్‌ ఫైజ్‌, మియా ఇఫ్తికార్‌ హుసేన్‌, సాగర్‌ నిజామీ వంటి ఉర్దూ రచయితలు, జైనేంద్ర కుమార్‌ వంటి హిందీ రచయితలతో పాటు హస్రత్‌ మోహానీ లాంటి ప్రసిద్ధులు ఈ ఆవిర్భావ మహాసభలో పాల్గొన్నారు. రవీంద్రనాథ్‌్‌ ఠాగోర్‌, మహమ్మద్‌ ఇక్బాల్‌, ఆచార్య నరేంద్ర దేవ్‌, సరోజినీ నాయుడు అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటును అభినందిస్తూ సందేశాలు పంపారు.
లక్నో కాంగ్రెస్‌ మహాసభలో నెహ్రూ ప్రవేశ పెట్టిన నూతన భావాలు రాజకీయాలను మలుపు తిప్పాయి. పునర్వికాస ఉద్యమానికి బీజాలు వేశాయి. ఈ మార్పు సాహిత్యంలోనూ ప్రతిఫలించింది. పాత అనుభవాలను చిత్రించిన ప్రేమ్‌చంద్‌ లాంటి వారు నూతన అనుభవా లను, నూతన జీవితాన్ని గురించి రాయడం మొదలు పెట్టారు. అభ్యుదయ రచయితలు పాతనంత టినీ తిరస్కరిస్తారన్న ఆరోపణలను అ.ర.సం. మొదటి మహాసభలోనే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రాచీన నాగరికతలోని మంచికంతటికీ మేం సాంస్కృతిక వారసులమని, సమాజాభ్యుదయానికి అడ్డు తగిలే ప్రతీఘాతుకులను ఎదిరిస్తామని ఈ మహాసభలో స్పష్టం చేశారు. మూఢ విశ్వాసాలను తొలగించాలని కోరతామని, రాజకీయ, సామాజిక పురోగామి ఉద్యమాలను అడ్డుకునే వారిని ఎదిరిస్తామని తేల్చి చెప్పారు. వాస్తవికతే నిజమైన అభ్యుదయానికి దారి తీస్తుందని విశ్వసించారు. పూర్వుల సత్సంప్రదాయాలను అనుసరిస్తూ సత్యాన్వేషణ కోసం అభ్యుదయానికి పాటు పడతామని మార్గ నిర్దేశం చేసుకున్నారు. ఏ సాంస్కృతిక ఉద్యమమూ, సాహిత్య సంఘమూ శూన్యంలోంచి ఉద్భవించదు. అంతర్జాతీయ పరిణామాలు, ఫాసిస్టు పోకడలను ఎదిరించడానికి కావలసిన అంశాలు ఎంతగా ఉద్యమానికి ఊతమిస్తాయో, దేెశంలో పొటమరిస్తున్న అభ్యుదయ భావాలూ, రచనలూ అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావానికి అంతే దోహదం చేశాయి.
1930 నాటికే ఉర్దూ సాహిత్యంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రతిఫలించడం మొదలైంది. దేవబంద్‌, అలీగఢ్‌ మేధోపరంగా మార్గ దర్శనం చేయడంలో విఫలమైనందువల్ల స్వతంత్రంగా ఆలోచించడం, తమ మార్గం ఏమిటో ఎంచుకోవడం రచయితలు అలవర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే 1932 డిసెంబర్‌లో పది కథలతో కూడిన ‘‘అంగారే’’ (నిప్పు కణిక) వెలువడిరది. ఇందులో సజ్జాద్‌ జహీర్‌ కథలు అయిదు, అహమద్‌ అలీ కథలు రెండు, మహమ్మదుర్‌ జాఫర్‌ కథ ఒకటి, రచయిత్రి రషీద్‌ జహా కథ ఒకటి, ఒక నాటకం ఉన్నాయి. రచయిత్రి రషీద్‌ జహా ప్రగతిశీల భావాలు వ్యక్తం చేయడం ఆ సమయంలో విప్లవాత్మక పరిణామమే. 1933 ఏప్రిల్‌ 5న ‘‘అంగారే’’ సంకలనాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ గ్రంథం సాహసానికి, వినూత్నతకూ ప్రతీక. దీనికి వ్యతిరేకంగా ఫత్వాలు జారీ అయ్యాయి. విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ ఆ సంకలనం రేపిన కలకలానికి నిదర్శనం. ఈ గ్రంథాన్ని అచ్చువేసిన ముద్రణాలయం మీద కూడా దాడి చేశారు. అయిదు ప్రతులు తప్ప మిగతా ప్రతులన్నీ దగ్ధం చేశారు. అతి తక్కువ మందికే ఈ గ్రంథం చదవే అవకాశం వచ్చింది. కానీ నిరసన మాత్రం అపారంగా వ్యక్తమైంది. అదే సమయంలో అఖ్తర్‌ హుసేన్‌ రాయపురి రాసిన ‘‘అదబ్‌ ఔర్‌ ఇన్‌క్విలాబ్‌’’, అభ్యుదయ భావాలు వ్యక్తం చేసిన ప్రగతిశీల రచయితల సంకలనం ‘‘రోషనాయీ’’ వెలువడ్డాయి. ఈ మూడు గ్రంథాలూ సాహిత్య గమనాన్నే మార్చేశాయి. అభ్యుదయ భావాలు గల రచయితలు సమకాలీన పలుకుబడులు ఉపయోగిం చడం వల్ల పాఠకులను నేరుగా చేరుకోగలి గారు. అంతకు ముందు సాహిత్యం అంతా విద్య, భాషా జ్ఞానం ఉన్నవారికే అందుబాటులో ఉండేది. కానీ అభ్యుదయ రచనల్లో వాడిన భాష, ఆలోచనా ధోరణి, భావ వ్యక్తీకరణ రీతి సామాన్య ప్రజలకు సైతం సాహిత్యాన్ని ప్రజలకు దగ్గర చేసింది. సమయానుగుణంగా రచయితల పదప్రయో గమూ మారింది. భాషా విన్యాసాల పరిధి దాటి అవసరానుగుణంగా తయారైంది. రచయితలు ప్రేయసితో సంభాషిం చడం మానేసి ప్రజలతో మాట్లాడడం మొదలు పెట్టారు. 1930 నాటికే ఉర్దూ సాహితీవేత్తలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు తమ సాహితీ సృజనలో స్థానం కల్పించారు. అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థా రూపంలోకి రాక ముందే భారతీయ సాహిత్యంలో ప్రగతిశీల భావాలు వ్యక్తం కావడం మొదలైంది. సాహిత్యానికి కదిలించే గుణం ఉంటుందంటే అర్థం ఇదే.
‘‘అంగారే’’ రచయితలు ‘‘ది లీడర్‌’’ పత్రికలో తమను తాము సమర్థించుకోవడంతో పాటు అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేసుకోవలసిన ఆవశ్యకత ఏమిటో విడమర్చారు. ఇంగ్లీషులోనూ భారతీయ భాషల్లోనూ ఇలాంటి రచనలు ఇంకా వెలువరిస్తామన్న సంకల్పాన్ని కూడా వెల్లడిరచారు. మూడేళ్ల తరవాత 1936 ఏప్రిల్‌ 9న అభ్యుదయ రచయితల సంఘం అవతరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు