పదిమంది మృతి..
సూడాన్ లోని ఆర్మీ ఎయిర్ బేస్ లో మంగళవారం రాత్రి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ కు ప్రయత్నిస్తూ కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు విమానంలోని ప్రయాణికులలో పదిమంది దుర్మరణం పాలయ్యారని సూడాన్ అధికార వర్గాలు తెలిపాయి. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానాశ్రయంలోని అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి, పలువురు ప్రయాణికులను కాపాడారు. ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నుంచి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రాథమిక దర్యాఫ్తులో విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.