మంగళగిరి చినకాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఆసుపత్రి భవన నమూనాపై అధికారులతో మంత్రి సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన నమూనాను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి అని అన్నారు. అత్యాధునిక వసతులతో వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దాలన్నారు. వంద పడకల విభాగంలో దేశానికి రోల్ మోడల్‌గా ఆసుపత్రి నిలవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో వైద్యులు పనిచేసేలా ఉండాలన్నారు. రోగులకు అత్యుత్తమ వైద్యం అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. డాక్టర్లు, పేషంట్లు, విజిటర్స్ కోణంలో జోన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రముఖ ఆసుపత్రుల భవన నమూనాలను పరిశీలించి తదనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలన్నారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలన్నారు. పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాను రూపొందించాలని సూచించారు.
మంగళగిరి వద్ద వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుపై నారా లోకేశ్ సమీక్ష
RELATED ARTICLES