విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని అంగన్వాడీ – 6 కేంద్రానికి తాగునీటి సమస్య తీర్చాలని అంగన్వాడీ కార్యకర్త చిట్టెమ్మ అధికారులను కోరారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంకు బాలింతలకు, గర్భిణులకు, చిన్నపిల్లల కోసం గ్రామ పంచాయతీ తాగునీటి పైపు లైను వేయడం జరిగిందన్నారు. అయితే అంగన్వాడీ కేంద్రంకు వేసిన పైపు లైను నుంచి ప్రజలు అక్రమంగా పైపు లైను వేసుకొన్నారని, దీంతో తమ కేంద్రానికి తాగునీరు సక్రమంగా సరఫరా లేక నీటి కొరత ఏర్పడిందన్నారు . ఈ విషయంపై తహశీల్దార్, ఎంపీడీఓ, స్పందన కార్యక్రమంలో వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కేంద్రానికి పోషక వాటిక పథకం మంజూరు అయిందని తెలిపారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా వేసుకొన్న పైపు లైను తొలగించి అంగన్వాడీ కేంద్రానికి తాగునీటి సమస్య తీర్చాలని కోరారు.