తల్లికి వందనం స్కీమ్ కు రూ.9,407 కోట్లు
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ లో కూటమి సర్కారు సంక్షేమానికి పెద్దపీట వేసింది. సూపర్ సిక్స్ హామీలు, అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించింది. ఈ కారణంగా వార్షిక బడ్జెట్ తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని నిలబెట్టుకునేందుకు బడ్జెట్ లో రూ.6300 కోట్లు కేటాయించారు. ఇక, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడేందుకు ఉద్దేశించిన తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్ లో రూ.9,407 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదనలు చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 12 వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం సాయం అందించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే ఈ పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఏటా రూ.15 వేలు ప్రభుత్వం జమచేయనుంది. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. ప్రతీ కుటుంబానికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు రూ.25 లక్షల బీమా సదుపాయం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు బడ్జెట్ లో కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. మరమగ్గాలపై ఆధారపడే చేనేత కుటుంబాలకు 500 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తామన్నారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందించేందుకు దీపం 2.0 పథకం కింద నిధుల కేటాయింపు జరిపామని మంత్రి పయ్యావుల కేశవ్ సభలో పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్ లో పెద్దపీట
RELATED ARTICLES