రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో కొద్దిసేపటి క్రితం పోలీసులు ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆయనను కస్టడీకి కోరుతూ ఈరోజు పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా, ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. పోసాని తన వ్యాఖ్యలతో కులాల మధ్య చిచ్చు పెట్టారని పోలీసులు అభియోగాలు మోపారు. అలాగే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన కుటుంబాన్ని నోటికి వచ్చినట్లుగా దూషించారని తెలిపారు. దీంతో పాటు సినీ పరిశ్రమకు ఓ కులాన్ని ఆపాదించారని పేర్కొన్నారు. నంది అవార్డుల కమిటీపై కులం పేరిట అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, నారా లోకేశ్‌ను అసభ్య పదజాలంతో తిట్టారని వెల్లడించారు. అదేవిధంగా పోసానిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదైనట్లు తెలిపారు.కాగా, పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు బుధవారం నాడు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు.రాత్రి 9.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనల అనంతరం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు తీర్పునిచ్చింది. దీంతో పోసాని మార్చి 13 వరకు రిమాండ్‌లో వుంటారు.