Friday, February 28, 2025
Homeఆంధ్రప్రదేశ్లెక్కలు ఫుల్‌.. ఖజానా నిల్‌…

లెక్కలు ఫుల్‌.. ఖజానా నిల్‌…

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఘాటుగా స్పందించారు. ఈ బడ్జెట్‌..లెక్కలు ఫుల్‌్‌.. ఖజానా నిల్‌ అని, ఇది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ఓ పెద్ద ప్రయత్నమని అన్నారు. 3,22,359 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రతిపాదించారు.. రెవిన్యూలోటు 33,185 కోట్లు,. ద్రవ్యలోటు 79,926 కోట్లు.. ఇంత లోటును ఎలా పూడుస్తారు? అప్పులు చేస్తారా? ఆస్తులు అమ్ముతారా? లేక ప్రజలపై భారం మోపుతారా? దీనిపై స్పష్టతేదీ? అని ప్రశ్నించారు. ఆనాడు జగన్‌ హయాంలో 4 లక్షల 21 వేల 201 కోట్ల రూపాయలు అప్పు చేశారని బడ్జెట్లో చెప్పారు.మరిప్పుడు 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నారు.వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి ప్రాధాన్యతే ఇవ్వలేదని చెప్పారు.
సాగునీటి రంగానికి కనీసం 10% కేటాయింపులు ఉండాలి. అంటే లెక్క ప్రకారం 32 వేల కోట్లు కేటాయించాలి. సాగునీటికి కేటాయించింది కేవలం 11,314 కోట్లు మాత్రమే. 3.5% కూడా లేదని తెలిపారు.పోలవరం కాకుండా రాష్ట్రంలో సాగునీటికి 77,845 కోట్ల రూపాయలు కావాలి. ఒక్క రాయలసీమకే 40,480 కోట్లు అవసరం. ఈ అరకొర కేటాయింపులతో కచ్చితంగా రాయలసీమకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ధరల స్థిరీకరణకు 4,500 కోట్లు అవసరం. కానీ 300 కోట్లే కేటాయించారు. గిట్టుబాటుధరల్లేక రైతులు అల్లాడుతుంటే, ఈ నిధులు సరిపోతాయా? అని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవకు 10,400 కోట్లు అవసరం కాగా 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు.కౌలు రైతులను పూర్తిగా విస్మరించారని చెప్పారు. ఉచిత బస్సును అటకెక్కించారు. ప్రతినెలా మహిళకు 1500 ఇస్తామన్నారు. బడ్జెట్లో ప్రస్తావించనేలేదు. ప్రతి నెలా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. దీనికి అతీగతీలేదని అన్నారు. బీసీలకు 50 ఏళ్లు దాటితే పెన్షన్‌, చంద్రన్న బీమా పథకాలనూ పక్కనపెట్టేశారు.ఆటో,టాక్సీ, లారీ డ్రైవర్లకు ఏటా 15000 ఇస్తామని ప్రకటించారు.. అదీలేదని అన్నారు. లాయర్లకు నెలకు 10 వేలు, కాపు సంక్షేమానికి 15,000 కోట్లు, పెళ్లికానుక లక్ష రూపాయలు ఇస్తామని డాంబికాలుపలికారు. వాటిని పూర్తిగా మర్చిపోయారు.ఇక తల్లికి వందనం, దీపం పథకాల్లోనూ భారీ కోత విధించారు.తల్లికి వందనానికి 25 వేల కోట్లు కావాలి. కానీ కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు.కోటీ 55 లక్షల మంది దీపం లబ్దిదారులను 90 లక్షలకు కుదించడమే గాక, బడ్జెట్లో 4 వేల కోట్లను కాస్త 2,601 తగ్గించేశారు.డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకూ సున్నా వడ్డీకి రుణమిస్తామని ప్రకటించిన కూటమి ఈ బడ్జెట్లో దానిపై ఒక్క మాటా చెప్పలేదు.అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ 2025-26 బడ్జెట్లో కానరాలేదు. ఇక ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించినట్లేనా? అని ప్రశ్నించారు. కూటమి పాలనలో ఏపీ చరిత్రలోనే రికార్డు స్థాయి అప్పులకు రంగం సిద్ధమైందని ఈ బడ్జెట్‌ స్పష్టంగా చెపుతోంది.గాలి బడ్జెట్‌ను గొప్ప బడ్జెట్‌ గా కీర్తిస్తున్న కూటమి నేతలు ఊహల నుంచి వాస్తవాల్లోకి రావాలి.పైగా దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన మోదీని పదేపదే కీర్తించడం మరీ విడ్డూరమని రామకృష్ణ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు